35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం

31 May, 2022 05:02 IST|Sakshi

రైల్వే నుంచి రాబట్టుకున్న ప్రయాణికుడు 

కోటా: రాజస్తాన్‌కు చెందిన సుజీత్‌ స్వామి అనే ఇంజనీర్‌ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఆ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికీ లబ్ధి చేకూర్చాడు. 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్లో స్వామి టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. క్యాన్సలేషన్‌లో భాగంగా 35 రూపాయల సర్వీస్‌ చార్జిని కూడా టికెట్‌ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్‌పై సర్వీస్‌ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు.

ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్‌ను టాగ్‌ చేశాడు. ఎట్టకేలకు సర్వీస్‌ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో దిగొచ్చింది. కానీ రౌండాఫ్‌ పేరుతో 33 రూపాయలే రీఫండ్‌ చేసింది. దాంతో మిగతా 2 రూపాయల కోసం కూడా పట్టుబట్టిన స్వామి, మూడేళ్ల పోరాటంతో వాటినీ సాధించాడు! 2017 జూన్‌ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికీ రూ.35 సర్వీస్‌ చార్జి రిఫండ్‌ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
 

మరిన్ని వార్తలు