రైల్వే పరీక్ష.. రివిజన్‌తో సక్సెస్‌

15 Jul, 2021 20:12 IST|Sakshi

జూలై 23, 24, 26, 31 తేదీల్లో ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ స్టేజ్‌–1 పరీక్ష

దేశవ్యాప్తంగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ)  విధానంలో నిర్వహణ

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ అంటే... రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌–నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌ ఎగ్జామ్‌. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. ఈనెల 23 నుంచి 31 వరకు ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారు చేసింది. ప్రస్తుతం నిర్వహించేది స్టేజ్‌–1 పరీక్ష. ఎగ్జామ్‌కు మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. అభ్యర్థులు ఈ విలువైన సమయాన్ని సమర్థంగా వినియోగించుకుంటే పరీక్షలో విజయం సాధించవచ్చు. ఈ నేపథ్యంలో.. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఎగ్జామ్‌ టిప్స్‌..  

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్, కమర్షియల్‌ అప్రెంటిస్, ట్రైన్స్‌ క్లర్క్, జూనియర్‌ టైమ్‌ కీపర్, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్, ట్రాఫిక్‌ అసిస్టెంట్, ట్రాఫిక్‌ అప్రెంటిస్, గూడ్స్‌ గార్డ్‌ మొదలైన ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇంటర్మీడియెట్‌(10+2) ఉత్తీర్ణులు, గ్రాడ్యుయేట్స్‌ ఈ పరీక్ష దరఖాస్తుకు అర్హులు. వయసు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులకు మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. తొలుత సీబీటీ(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)1, ఆ తర్వాత సీబీటీ(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) 2, స్కిల్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు. ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ టెస్ట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం జరిగే ది పరీక్ష స్టేజ్‌–1. ఇందులో అర్హత సాధించిన వారిని రెండో దశ(స్టేజ్‌–2)కు ఎంపిక చేస్తారు. రెండో దశ పరీక్ష సైతం ఆన్‌లైన్‌ విధానంలోనే ఉంటుంది. ఆ తర్వాత టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌/కంప్యూటర్‌ ఆధారిత అప్టిట్యూడ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌/మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఉంటాయి. 

స్టేజ్‌–1 పరీక్ష
► తొలి దశ పరీక్ష 100 ప్రశ్నలు–100 మార్కులకు జరుగుతుంది.ఇందులో మ్యాథమెటిక్స్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90నిమిషాలు. స్టేజ్‌1లో అర్హత సాధించినవారిని స్టేజ్‌2కు అనుమతిస్తారు. 

స్టేజ్‌–2 పరీక్ష
రెండో దశ పరీక్ష 120 ప్రశ్నలు–120 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్‌ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్‌ 35 ప్రశ్నలు–35 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానినికి 1/3 మార్కు కోత వేస్తారు. 


ప్రిపరేషన్‌ ప్రణాళిక

► ఎంతో కాలంగా ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్ష కోసం సిద్ధమవుతున్న వారు ఇప్పటికే సిలబస్‌ అంశాల అధ్యయనం పూర్తిచేసి ఉంటారు. 

► ఇప్పుడున్న తక్కువ సమయంలో అభ్యర్థులు తమ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోవడం అవసరం. ఏ విభాగంలో బలహీనంగా ఉన్నారో గుర్తించి.. దానికి ఎక్కువ సమయం కేటాయించాలి. 

► పరీక్ష రోజు వరకు అభ్యర్థులు గత ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌ చేయడం మంచిది. ఇది పరీక్షలో టైమ్‌ మేనేజ్‌మెంట్‌కు దోహదపడుతుంది. 

► ఒక సబ్జెక్ట్‌ కోసం ఎంత సమయం కేటాయించారో.. ఆలోపే చదవడం పూర్తి చేయాలి. ప్రతిరోజు రివిజన్‌ చేయడం మరిచిపోవద్దు. 

► ఆన్‌లైన్‌లో మాక్‌టెస్టులు ప్రాక్టీస్‌ చేయడం ద్వారా ఒత్తిడిని జయించడంతోపాటు వేగం పెంచుకోవచ్చు. 

►  ప్రస్తుతం అందుబాటులో ఉన్న తక్కువ సమయంలో ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచి మార్కులు స్కోరు చేయవచ్చో తెలుసుకోవాలి. 

► గణిత విభాగానికి సంబంధించిన ఫార్ములాలు, సూత్రాలను గుర్తుంచుకోవాలి.

► ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ సిలబస్‌లో పేర్కొన్న టాపిక్స్‌ అన్నీ కవర్‌ చేశారో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కొత్త అంశాల జోలికి వెళ్లడం కంటే ఇప్పటికే చదివిన టాపిక్స్‌ను మరోసారి అధ్యయనం చేయడం మంచిది. 

► ఏదో ఒక ఒక సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించకుండా..టైమ్‌ టేబుల్‌ ప్రకారం అన్ని అంశాలకు సన్నద్ధమవ్వాలి.
 
► ప్రతి ప్రశ్నను పరిష్కరించడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. జవాబులను త్వరగా గుర్తించేందుకు సత్వరమార్గాలు, చిట్కాలను గుర్తుంచుకోవాలి. 

► ఏదైనా ఒక టాపిక్‌ను సాధన చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తితే.. ఇతర టాపిక్స్‌ను చదవడం లేదా ఇంతకుముందు చదివిన టాపిక్స్‌ను మరోసారి ప్రాక్టీస్‌ చేయడం మంచిది. 


పరీక్ష రోజు టిప్స్‌

► పరీక్షలో మొదట తేలికపాటి ప్రశ్నల నుంచి క్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు గుర్తించడం మంచిది. దీనివల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించేందుకు వీలవుతుంది. 

►  గణిత విభాగంతో పోలిస్తే, జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగాల ప్రశ్నలకు సులభంగానే సమాధానాలు గుర్తించవచ్చు. కాబట్టి మొదట సులభమైన వాటితో పరీక్ష ప్రారంభించాలి. దీనివల్ల కేటాయించిన సమయం కంటే ముందే తేలికపాటి ప్రశ్నలు ముగిస్తే.. క్లిష్ట ప్రశ్నలకు కేటాయించేందుకు అధిక సమయం లభిస్తుంది. 

► ఒక ప్రశ్నకు 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం కేటాయించకుండా చూసుకోవాలి. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలను చివరగా ప్రయత్నించడం మేలుచేస్తుంది. 

మరిన్ని వార్తలు