ఇదేం పద్ధతి?

16 Sep, 2021 05:22 IST|Sakshi

ట్రిబ్యునళ్లలో కొందరినే ఏరికోరి నియమిస్తారా?

సుప్రీంకోర్టు అసంతృప్తి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్లలో నియామకాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సెర్చ్‌ అండ్‌ సెలక్షన్‌ కమిటీ సిఫారసు చేసిన జాబితాను పక్కనపెట్టి కొందరినే ఏరికోరి నియమించడం ఏమిటని నిలదీసింది. ‘నియామక పత్రాలను పరిశీలిస్తే సెలెక్ట్‌ లిస్ట్‌ నుంచి కేవలం ముగ్గురిని ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోంది. మిగిలిన వారంతా నిరీక్షణ జాబితాలో ఉన్నవారే. సెలెక్ట్‌ లిస్ట్‌లోని ఇతరుల పేర్లను తిరస్కరించారు.

సర్వీసు చట్టం ప్రకారం.. సెలెక్ట్‌ లిస్టును కాదని వెయిటింగ్‌ లిస్టుకు ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదు. ఇదేం పద్ధతి? ఇదేం ఎంపిక ప్రక్రియ?’ అని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావుల సుప్రీంకోర్టు ధర్మాసనం అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ను ప్రశ్నించింది. సెలక్షన్‌ కమిటీ సిఫారసు చేసిన జాబితాలోని పేర్ల నుంచే ట్రిబ్యునళ్లలో ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని వేణుగోపాల్‌ బదులిచ్చారు. ట్రిబ్యునళ్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది.

ఇన్‌కం ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఐటీఏటీ) కోసం సెలక్షన్‌ కమిటీ 41 మందిని సిఫారసు, అందులో నుంచి కేవలం 13 మందిని ఎంపిక చేశారని లాయర్‌ అరవింద్‌ దాతర్‌ చెప్పారు. ఇదేం కొత్త కాదు, ప్రతిసారీ ఇదే కథ అని ధర్మాసనం ఆక్షేపించింది. ట్రిబ్యునళ్లలో నియామకం కోసం తమ దృష్టికి వచ్చిన పేర్లను షార్ట్‌లిస్టు చేయడానికి కోవిడ్‌ కాలంలో కోర్టు ఎంతగానో శ్రమించిందని సీజేఐ జస్టిస్‌ రమణ అన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నమంతా వృథా అయ్యిందని అసహనం వ్యక్తం చేశారు. తాజా నియామకాలను పరిశీలిస్తే ట్రిబ్యునళ్లలో సభ్యుల పదవీ కాలం కేవలం సంవత్సరమే ఉందని పేర్కొన్నారు. సంవత్సరం కోసం జడీ్జలు ట్రిబ్యునల్‌ సభ్యులుగా వెళ్తారా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వమే పాటించకపోతే ఎలా?
సెలక్షన్‌ కమిటీ సిఫారసులను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్‌ చెప్పగా ధర్మాసనం ప్రతిస్పందించింది. ‘‘మనది రూల్‌ ఆఫ్‌ లా పాటించే దేశం. రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నాం. ‘సిఫారసులను అంగీకరించను’ అని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదు’’ అని హితవు పలికింది. నియామకాల ప్రక్రియను ప్రభుత్వమే పాటించకపోతే ఆ ప్రక్రియకు విలువ ఏమున్నట్లు? అని వ్యాఖ్యానించింది.

ఆదరాబాదరగా నియమించాలి్సన అవసరమేంటి?
నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) తాత్కాలిక చైర్‌పర్సన్‌గా జస్టిస్‌ వేణుగోపాల్‌ను ఆదరాబాదరగా నియమించడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై గురువారం విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్‌ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు