ఇటాలియన్‌ మెరైన్స్‌ కేసు.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

9 Apr, 2021 16:27 IST|Sakshi

ఇటాలియన్‌ మెరైన్స్‌ కేసుకు సంబంధించి సుప్రీం కీలక వ్యాఖ్యలు

నష్టపరిహారం మొత్తాన్ని భారత ప్రభుత్వం వద్ద జమ చేశాకే తరువాతి విచారణ

న్యూఢిల్లీ: ఇటాలియన్‌ మెరైన్స్‌ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన 10 కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లిస్తేనే తాము ఈ కేసును మూసివేస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అనగా 2012, ఫిబ్రవరి 15న లో కేరళ తీరం వెంబడి చేపల వేటకు వెళ్ళిన జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటలీ ఓడ ‘ఎన్రికా లెక్సి’పై ఉన్న ఇటలీ మెరైన్లు సాల్వేటోర్‌ గిరోనే, మాసిమిలియానో లాటోరే కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ జాలర్లు చనిపోయారు. ఇందుకు కారకులైన మెరైన్స్‌ను ఇటలీ విచారించాలని అంతర్జాతీయ ట్రిబ్యూనల్‌ ఆదేశించింది. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాల్సిందిగా బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా బాధిత కుటుంబాలకు ఇటలీ ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్లు కోర్టుకు తెలిపాడు. ఇరు దేశాల మధ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును త్వరితగతిన ముగించాల్సిందిగా తుషార్‌ మెహతా ధర్మసనాన్ని కోరాడు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ నెల 19న కేసును విచారిస్తామని తెలిపింది. ఈలోపు ఇటలీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు చెల్లించే నష్టపరిహారం మొత్తాన్ని భారత ప్రభుత్వం వద్ద డిపాజిట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. ఆ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు పంచుతామని కోర్టు తెలిపింది. 

ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం, కేంద్రం అకౌంట్‌ నంబర్‌ సెండ్‌ చేస్తే.. తాము బాధితుల కుంటుబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని ఆ ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. దాంతో కేంద్రం ఈ రోజు అకౌంట్‌ నంబర్‌ని ఇటలీ ప్రభుత్వానికి సెండ్‌ చేసింది. డబ్బులు వచ్చిన మూడు రోజుల్లో ఆ మొత్తాన్ని సుప్రీంకోర్టు వద్ద డిపాజిట్‌ చేస్తామని కేంద్రం తెలిపింది. ఈ కేసును త్వరితగతిన విచారించాలన్న వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘మేం అన్ని కేసులను త్వరగానే పరిష్కరించాలనుకుంటాం. కానీ ప్రభుత్వమే గడువు కావాలని కోరి.. ఆలస్యం అయ్యేలా చేస్తుందంటూ’’ చురకలంటించింది.  

చదవండి: గతేడాది ఆత్మహత్య.. రూ.100 కోట్లు ఇప్పించండి

మరిన్ని వార్తలు