భారత ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు

21 Aug, 2021 01:30 IST|Sakshi

న్యూఢిల్లీ: తాలిబన్ల మాటలకు చేసే చేష్టలకి ఎక్కడా పొంతన కుదరడం లేదు. దేశంలో విదేశీ ప్రతినిధులకు, కార్యాలయాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పిన వారు తమ నీచ బుద్ధిని బయట పెట్టుకున్నారు. అఫ్గాన్‌లో భారత దౌత్య కార్యాలయాల్ని తాత్కాలికంగా మూసేసినప్పటికీ తాలిబన్లు తనిఖీలు నిర్వహించారు. కీలక పత్రాలేమైనా దొరుకుతాయేమోనని కార్యాలయాల్లో అణువణువూ గాలించారు. కాందహార్, హెరాత్‌లో ఉన్న భారత కాన్సులేట్‌లలో బుధవారం తాలిబన్లు సోదాలు నిర్వహించి కార్యాలయం అంతటినీ చిందరవందర చేసి పడేశారు.ఆ కార్యాలయాల ఆవరణల్లో పార్క్‌ చేసి ఉన్న వాహనాలను తమ వెంట తీసుకువెళ్లినట్టు శుక్రవారం దౌత్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు. (చదవండి: ‘ఇంటికి పో, అక్కడే ఉండు, ఇంకెప్పుడూ రాకు’)

‘‘మేము ఈ విషయం ముందే ఊహించాం. తాలిబన్లు భారత కాన్సులేట్లను అణువణువు తనిఖీ చేశారు. కీలక పత్రాలేమైనా లభిస్తాయేమోనని గాలించారు. మేము పార్క్‌ చేసిన వాహనాలను తీసుకువెళ్లి పోయారు’’అని అ అధికారి వెల్లడించారు. సోదాలకు కొద్ది రోజుల ముందే అఫ్గాన్‌లో భారత రాయబారి సిబ్బందికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని తాలిబన్‌ రాజకీయ విభాగం నుంచి సందేశం వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా భారత్‌ దౌత్య సిబ్బంది, భద్రతా అధికారుల్ని వెనక్కి తీసుకు వచ్చేసింది.  

31 వరకు వేచి చూసే ధోరణి
అఫ్గానిస్తాన్‌లో ఏర్పాటయ్యే ప్రభుత్వంపై తాలిబన్లకు ఈ నెల 31 వరకు ఎలాంటి ప్రకటన చేసే ఉద్దేశం లేదని అఫ్గాన్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా తన సైనిక బలగాలను ఈ నెల 31లోగా ఉపసంహరిస్తామని చెప్పడంతో అప్పటివరకు వారు వేచి చూసే ధోరణిలో ఉంటారని ఆ అధికారి తెలిపారు. అమెరికా బలగాల ఉపసంహరణ గడువు వరకు తాలిబన్లు చేసేదేమీ లేదన్నారు. ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని కొత్త ప్రభుత్వంలో చేర్చుకుంటామని తాలిబన్లు చెప్పినా మాటపై నిలబడతారన్న నమ్మకం ఎవరికీ లేదు.  

మరిన్ని వార్తలు