భారీ బెలూన్‌తో నింగికి శాటిలైట్లు

8 Feb, 2021 09:06 IST|Sakshi
బుల్లి శాటిలైట్‌ను చూపుతున్న నిర్వాహకులు 

కలాం పేరిట రికార్డు ప్రయత్నం  

సాక్షి, చెన్నై: భారీ బెలూన్‌ సాయంతో నింగికి వంద శాటిలైట్లను ప్రయోగించి విద్యార్థులు రికార్డు ప్రయత్నం చేశారు. మిస్సైల్‌ మ్యాన్‌ అబ్దుల్‌ కలాం పుట్టిన గడ్డ రామేశ్వరం ఈ కార్యక్రమానికి ఆదివారం వేదికైంది. అబ్దుల్‌కలాం కలలను సాకారం చేసే రీతిలో ఆయన కుటుంబీకులు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌కలాం అంతర్జాతీయ ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ ట్రస్టు నేతృత్వంలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను చాటే రీతిలో చిన్నపాటి శాటిలైట్ల తయారీపై ప్రత్యేక కార్యక్రమాన్ని గతవారం చేపట్టారు. ఇందుకోసం తమిళనాడుతో పాటు దేశంలోని వివిధ కళాశాలలకు చెందిన రెండు వందల మంది విద్యార్థులు రామేశ్వరానికి తరలివచ్చారు. 

భారీ బెలూన్‌తో.. 
ప్రపంచంలోనే అతి చిన్నశాటిలైట్లుగా 40 గ్రాముల నుంచి 50 గ్రాముల్లోపు విద్యార్థులు సిద్ధం చేశారు. విద్యార్థులు సిద్ధం చేసిన వంద శాటిలైట్లను ప్రయోగించే రీతిలో ఆదివారం రామేశ్వరంలో కార్యక్రమం జరిగింది. ఆన్‌లైన్‌ ద్వారా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 నుంచి 8 అడుగుల మేరకు ఉన్న భారీబెలూన్‌లో ఈ శాటిలైట్లను పొందు పరిచి గాల్లోకి వదిలారు.

వాతావరణ పరిశోధ, ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాలు తెలుసుకునే రీతిలో ఈ ప్రయోగం సాగింది. రామేశ్వరం పరిసరాలకు చెందిన వెయ్యికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. కలాం మనవళ్లు షేక్‌ సలీం, షేక్‌ దావుద్, అబ్దుల్‌ కలాంతో పనిచేసిన శాస్త్రవేత్త శివథానుపిల్‌లై, పలు విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు, కళాశాలల ప్రొఫెసర్లు, పరిశోధకలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేవలం అవగాహన కల్పించే రీతిలో కలాం పేరిట రికార్డు ప్రయత్నంగా భారీ బెలూన్‌ ద్వారా శాటిలైట్ల ప్రయోగం కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆయన మనవళ్లు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు