సీమాపాత్ర చేతిలో చిత్రహింసలకు గురైన సునీత.. చదువుకు సాయం అందిస్తానన్న కేటీఆర్‌

31 Aug, 2022 17:18 IST|Sakshi

హైదరాబాద్‌: తన ఇంట్లో పని చేసే మహిళను అత్యంత పైశాచికంగా హింసించిన ఉదంతంలో జార్ఖండ్‌ బీజేపీ సస్పెండెడ్‌ నేత సీమా పాత్రా అరెస్ట్‌ అయ్యింది. బాధితురాలు సునీతకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ కావడం, అందులో ఆమె సీమ చేతిలో ఎంత దారుణంగా హింసించబడిందో వివరించడంతో దుమారం రేగింది.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కోలుకుంటే.. తనకు చదువుకోవాలని ఉందంటూ బాధితురాలు చెప్పిన వీడియో ఒక దానిని ప్రముఖ జర్నలిస్ట్‌ బర్ఖా దత్ పోస్ట్‌ చేశారు. ‘‘ఆమె పళ్లు విరిగిపోయాయి. ఎనిమిదేళ్లుగా నరకం అనుభవించింది. సీమాపాత్ర ఆమెను క్రూరంగా హింసించింది. కోలుకున్నాక చదువుకోవాలని బాధితురాలు చెబుతోంది’’ అంటూ దత్‌ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి ట్విటర్‌లో స్పందించారు కేటీఆర్‌. 

తాను వ్యక్తిగతంగా ఆమె చదువుకు అవసరమయ్యే సాయం అందించేందుకు సిద్ధమని కేటీఆర్‌ పేర్కొన్నారు. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యుల వివరాలను పంపాలంటూ బర్ఖా దత్‌ను కోరారాయన. కేటీఆర్‌ బదులును అభినందించిన దత్‌.. అలాగే చేద్దాం అంటూ బదులిచ్చారు. 

రాంచీ అశోక్‌ నగర్‌లోని తన లగ్జరీ ఇంటి పనుల కోసం గిరిజన మహిళ సునీతను ఎనిమిదేళ్ల కిందట తెచ్చుకుని.. దారుణంగా హింసించింది సీమా పాత్ర. ఈ ఉదంతం సంచలనం సృష్టించగా.. ఎట్టకేలకు ఇవాళ ఉదయం పారిపోతున్న సీమను వెంబడించి అరెస్ట్‌ చేశారు పోలీసులు. మరోవైపు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది కూడా. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీమపై కఠిన చర్యలు తీసుకోవాలని జార్ఖండ్‌ డీజీపీని ఆదేశించింది. 

ఇదీ చదవండి: పనిమనిషిని చిత్రహింసలు పెట్టిన బీజేపీ నేత అరెస్టు

>
మరిన్ని వార్తలు