క్రీడాకారులకు బంపర్‌ ఆఫర్‌.. బంగారు పతకం గెలిస్తే రూ.3 కోట్లు 

27 Jun, 2021 11:47 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే తమిళ క్రీడాకారులకు సీఎం ఎంకే స్టాలిన్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. బంగారు పతకం సాధిస్తే రూ.3 కోట్లు, వెండికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో నాలుగు చోట్ల ఒలింపిక్స్‌ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. క్రీడాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

సాక్షి, చెన్నై(తమిళనాడు): క్రీడాకారులకు కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు శనివారం శ్రీకారం చుట్టారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం ఎంకే స్టాలిన్‌ పాల్గొని తమిళనాడు నుంచి ఒలింపిక్స్‌ వెళ్తున్న ఏడుగురు క్రీడాకారులకు తలా రూ.ఐదు లక్షల ప్రోత్సాహకాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ క్రీడను ఆటగా కాకుండా సత్తా చాటాలన్న ఆకాంక్షతో ముందుకు సాగితే పతకం విజయం సాధించవచ్చని తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. క్రీడాకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు.  

పతకంతో వస్తే నజరానా..
రాష్ట్రంలో నాలుగు చోట్ల ఒలింపిక్‌ అకాడమీలను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల్ని ప్రోత్స హిస్తూ రవాణాతో సహా అన్ని ఖర్చులు భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. క్రీడల్లో మెరుగైన శిక్షణ ఇస్తామన్నారు. క్రీడాకారులు పతకాలు సాధించి రాష్ట్ర గౌరవాన్ని ఎలుగెత్తి చాటాలని పిలుపునిచ్చారు. చెన్నైలో క్రీడా నగరం ఏర్పాటు చేయనున్నామని, ఇక్కడ అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం నుంచి టోకియో ఒలింపిక్స్‌కు వెళ్తున్న క్రీడాకారులు పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఒలింపిక్‌లో బంగారు పతకం సాధిస్తే రూ.3 కోట్లు, వెండి పతకానికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి నగదు బహుమతి ఇస్తామని వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణ్యం, క్రీడాశాఖ మంత్రి మయ్యనాథన్, దేవాదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ పాల్గొన్నారు.  

ఇంగ్లాండ్‌కు పయనమా? 
రాష్ట్ర  ప్రభుత్వ పరిధిలోని శాఖల్లో సాగుతున్న అభివృద్ధి, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించాలని సీఎం స్టాలిన్‌ నిర్ణయించారు. మొదట శనివారం పరిశ్రమల శాఖ వర్గాలతో సమావేశమయ్యారు. పెట్టుబడుల ఆహ్వానం, ప్రస్తుతం పెట్టుబడులు పెట్టిన సంస్థలు, సాగుతున్న పనులపై సమీక్షించారు. రాష్ట్రంలోకి పెట్టుబడుల్ని ఆహ్వానించడమే లక్ష్యంగా జూలై లేదా ఆగస్టులో స్టాలిన్‌ ఇంగ్లాండ్‌కు పయనమయ్యేలా చర్చ సాగినట్టు సమాచారం. ఇక తన నియోజకవర్గం కొళత్తూరులో సాయంత్రం స్టాలిన్‌ పర్యటించారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించారు. అలాగే రంగు చేపల పెంపకం, ఉత్పత్తి, విక్రయదారులతో సమావేశమయ్యారు.   

చదవండి: Delta Variant:: రేపటి నుంచి మళ్లీ కఠిన ఆంక్షలు 

మరిన్ని వార్తలు