కశ్మీర్‌లోకి టర్కీ కిరాయి సైనికులు!

5 Dec, 2020 01:47 IST|Sakshi
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌

ఒక్కొక్కరికి 2వేల డాలర్ల నజరానా

న్యూఢిల్లీ: కశ్మీర్‌లోకి టర్కీ తూర్పు సిరియా నుంచి కిరాయి సైనికులను పంపుతోందని ఏఎన్‌ఎఫ్‌ న్యూస్‌ తెలిపింది. త్వరలో ఇక్కడ నుంచి కశ్మీరుకు చేరాలని సిరియాలోని సులేమన్‌షా బ్రిగేడ్స్‌ టెర్రరిస్టు ఆర్గనైజేషన్‌ అబు ఇమ్‌షా తన అనుచరులకు సూచించారని స్థానిక వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది. త్వరలో కశ్మీర్‌కు వెళ్లే వారి జాబితాను టర్కీ అధికారులు ఇతర టెర్రరిస్టు కమాండర్లను అడిగి తయారు చేస్తారని అబు ఇమ్‌షా చెప్పాడు. ఈ జాబితాలో పేరు నమోదు చేయించుకున్నవారికి 2 వేల డాలర్లు ముడతాయని వివరించాడు.

ఇదంతా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ పన్నాగమని గ్రీకు జర్నలిస్టు అండ్రియాస్‌ మౌంట్‌జొరాలియస్‌ ఒక నివేదికలో వెల్లడించారు. ఇస్లాం ప్రపంచంలో సౌదీ డామినేషన్‌ను సవాలు చేసేందుకు ఎర్డోగాన్‌ యత్నిస్తున్నారని, ఆగ్నేయాసియాలో ముస్లింలపై పట్టు సాధించేందుకు కశ్మీర్‌ విషయంలో పాక్‌కు మద్దతు పలుకుతున్నారని ఆండ్రియాస్‌ చెప్పారు.  అయితే భారత్‌లో టర్కీ రాయబారి ఈ వార్తలను నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి తొలగించిన సందర్భంలో టర్కీ పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. అలాగే పలుమార్లు పాక్‌కు అంతర్జాతీయ వేదికలపై కూడా టర్కీ మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌ అంశంలో టర్కీ తలదూరుస్తుందన్న వార్తలపై రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు