విమాన ప్రమాదం : మృత్యుంజయులైన కవలలు

8 Aug, 2020 12:06 IST|Sakshi

విషాదంనుంచి బైటపడిన అదృష్టవంతులు 

తెలియని తల్లి జాడ, ఆందోళనలో బంధువులు

సాక్షి, తిరువనంతపురం: సమయం గడుస్తున్న కొద్దీ  కేరళ కోళికోడ్ విమాన ప్రమాదం బాధితుల గాథలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. నిపుణుడు, అనుభవజ్ఞుడైన పైలట్ దీపక్‌ వసంత్‌ సాథే  సారధ్యంలో విమానం అదుపు తప్పడం ఒక విషాదమైతే...మరికొద్ది క్షణాల్లో సొంతగడ్డపై కాలు మోపే సమయంలో కొంతమంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం మరో విషాదం. అయితే ఇంతటి ఘోర ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడి కవలలు మృత్యుంజయులుగా నిలిచిన వార్త కాస్త ఊరటనిస్తోంది. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు)

న్యూస్ మినిట్ కథనం ప్రకారం ఈ కవలల కుటుంబం దుబాయ్ లో నివసిస్తోంది. తండ్రి దుబాయ్ లోనే ఉండిపోగా, తల్లి, తన నలుగురు బిడ్డలతో కలసి వందే భారత్ మిషన్ ద్వారా కేరళకు ఎయిరిండియా విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో  చిక్కుకోగా,  ఏడేళ్ల కవలలు జైన్, జమిల్ కుండోట్ పారకల్ ప్రాణాలతో బయటపడిన అదృష్ట వంతులుగా నిలిచారు. వీరి  సోదరి, సోదరుడు కూడా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జియాకు (10) ఫ్రాక్చర్ కావడంతో ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతుండగా, జియాన్ (14) ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  అయితే తల్లి  ఎలా ఉన్నారనేది దానిపై  వివరాలు తెలియరాలేదు. దీంతో బంధువులు ఆందోళనలో పడిపోయారు.  (విషాదం : మృత్యువును ముందే పసిగట్టాడేమో? )

స్వల్పంగా గాయపడిన వీరిని స్థానికులు, రక్షణ సిబ్బంది ఫిరోక్ చుంగమ్‌లోని రెడ్ క్రెసెంట్ ఆసుపత్రికి తరలించారు. 'గుర్తు తెలియని కవలలు' పేరుతో జిల్లా అధికారులు పేరుతో వీరిని ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు.  తద్వారా వీరిని మలప్పురం వాసులుగా గుర్తించారు. వారి సమీప బంధువు, మేనమామ రావడంతో శుక్రవారం సాయంత్రం  డిశ్చార్జ్ అయ్యారని ఆసుపత్రి  సిబ్బంది ధృవీకరించారు.

మరిన్ని వార్తలు