India Monkeypox Raise: మంకీపాక్స్‌ కొత్తదేం కాదు.. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు: పార్లమెంట్‌లో ఆరోగ్యమంత్రి

2 Aug, 2022 14:36 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో మరో కేసు వెలుగు చూడడంతో.. మొత్తం ఏడుకి చేరుకుంది మంకీపాక్స్‌ బాధితుల సంఖ్య. ఇందులో ఐదు కేరళ, రెండు కేసులు ఢిల్లీలో వెలుగు చూశాయి. చాలా ప్రాంతాల్లో అనుమానిత లక్షణాలతో పరీక్షలకు శాంపిల్స్‌ను పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఈ క్రమంలో.. 

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్షుక్‌ మాండవియా.. మంకీపాక్స్‌పై రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మంకీపాక్స్‌ కొత్త వైరస్‌ ఏం కాదు. భారత్‌కు, ఈ ప్రపంచానికి అది కొత్తేం కాదు. దశాబ్దాల నుంచే ఆఫ్రికాలో ఉంది. కరోనా టైంలో ఎన్నో మంచి పాఠాలు నేర్చుకున్నాం. కాబట్టి, మంకీపాక్స్‌ గురించి భయపడాల్సిన అవసరం లేదు.

ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. కేరళలో తొలి కేసు నమోదు అయినప్పుడే ఆరోగ్య శాఖ తరపున ఓ బృందాన్ని అక్కడికి పంపించాం. కేంద్రం తరపున స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ కూడా వైరస్‌ను అధ్యయనం చేస్తోంది. కేరళ ప్రభుత్వం ఆ ఫోర్స్‌కు అన్నివిధాల సహకరిస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారాయన. అలాగే..

ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశాం. అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించాం.  ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 1970 నుంచే ఆఫ్రికాలో మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూశాయి. ఈ ఏడాది మరో 75 దేశాల్లో వెలుగు చూసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ మీద ప్రత్యేక దృష్టి సారించింది కూడా. వైరస్‌ బారిన పడ్డ వాళ్లకు ఐసోలేషన్‌ కోసం రెండు వారాల గడువు రికమండ్‌ చేసినట్లు పేర్కొన్న ఆయన.. వ్యాక్సిన్‌ తయారీ అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.  

ఇదీ చదవండి: అచ్చం చికెన్‌పాక్స్‌లాగే.. మంకీపాక్స్‌ కూడా! కాకపోతే..

మరిన్ని వార్తలు