ఉత్తరకాశీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌ | Sakshi
Sakshi News home page

Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌.. 41 మంది సురక్షితం

Published Tue, Nov 28 2023 8:15 PM

Uttarakhand Tunnel Rescue Operation Live Updates - Sakshi

కోట్లాది మంది ప్రార్థనలు ఫలించాయి. ఉత్తరాఖండ్‌ సిల్‌క్యారా సొరంగం ఆపరేషన్‌ విజయవంతం అయ్యింది. టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులను మంగళవారం సురక్షితంగా బయటకు తెచ్చింది రెస్క్యూ టీం. పాక్షికంగా కూలిపోయిన టన్నెల్‌లో చిక్కుకున్న కూలీలంతా క్షేమంగానే ఉండగా.. వైద్య పరీక్షల కోసం ఆంబులెన్స్‌లో వాళ్లను ఆస్పత్రికి తరలించారు. మొత్తంగా 17 రోజులపాటు నిర్మిరామంగా కృషి చేసి బయటకు తెచ్చిన బలగాలపై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సైతం ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యిందని వీడియో సందేశం ఎక్స్‌లో ఉంచారు.

కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేసిన అధికారులు.. చివరకు రాట్‌హోల్‌ మైనింగ్‌ టెక్నిక్‌తో విజయం సాధించారు. మంగళవారం సాయంత్రం ఐదుగురు సభ్యుల బృందం ప్రత్యేక పైప్‌ ద్వారా లోపలికి వెళ్లి కార్మికులను ఒక్కొక్కరిగా బయటకు తెచ్చింది. గంటపాటు కొనసాగిన ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి అయ్యింది. ఘటనాస్థలానికి ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి, రోడ్డు రవాణా శాఖల మంత్రి జనరల్‌ వీకే సింగ్‌లు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. 

నవంబర్‌ 12వ తేదీన పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ కొంతభాగం కూలిపోయి 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి. అదృష్టవశాత్తూ టన్నెల్‌లో రెండు కిలోమీటర్ల ప్రాంతం తిరగడానికి ఉండడం, బయట నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు అందించడంతో వాళ్లంతా క్షేమంగా ఉండగలిగారు. మరోవైపు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుకల్పించి మానసికంగానూ ధైర్యం అదించారు అధికారులు.

అంతకు ముందు దాదాపు 17 రోజులుగా సొరంగంలో ఉన్న వీరి వద్దకు ఆరు అంగుళాల వ్యాసం ఉన్న గొట్టాన్ని పంపించారు. ఆ పైప్‌ ద్వారా ఓ ఎండోస్కోపీ తరహా కెమెరాను పంపగా.. కూలీలంతా సురక్షితంగా ఉన్నట్లు అందులో కన్పించింది. 

ఫలించిన ప్రార్థనలు
కుటుంబ సభ్యుల ఆందోళనలు ఒకవైపు.. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న కార్మికులు బయటకు రావాలని కోట్ల మంది ప్రార్థించారు. అధికారులు సైతం ఆశలు వదిలేసుకోకుండా నిరంతరంగా శ్రమించారు. కార్మికులు బయటకు వస్తున్న సమయంలో మిఠాయిలు పంచుకుంటూ స్థానికులు కనిపించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement