వందే భారత్‌ రైలుకు మరో ప్రమాదం.. నెల రోజుల్లో మూడో ఘటన

29 Oct, 2022 15:05 IST|Sakshi

గాంధీనగర్‌: ముంబయి- గాంధీనగర్‌ మధ్య నడుస్తోన్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వరుస ప్రమాదాలకు గురవుతోంది. శనివారం ఉదయం ఎద్దును ఢీకొట్టడంతో మందుభాగం ఊడిపోయింది. నెల రోజుల్లోనే ఇలాంటి సంఘటనలు జరగటం ఇది మూడోసారి కావటం గమనార్హం. గుజరాత్‌లోని అతుల్  రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 8.17 గంటలకు రైలును ఎద్దు ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌ కోచ్‌ ముందుభాగం ఊడిపోయింది. దానిని బాగు చేసేందుకు 15 నిమిషాల పాటు రైలు ఆగిపోయింది. ఈ రైలు డ్రైవర్‌ బోగీ నోస్‌ కోన్‌ కవర్ ధ్వంసమైందని భారత రైల్వే శాఖ వెల్లడించింది.

గాంధీనగర్-ముంబయి మధ్య వందే భారత్ సెమీ-హైస్పీడ్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్‌ 1 నుంచి ఈ రైలు సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. పశువులు ఢీ కొట్టే ఘటనలను తప్పించలేమని, రైలు డిజైనింగ్ సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.

ఇదీ చదవండి: మొరాయించిన ‘వందే భారత్‌’ ట్రైన్‌.. వరుసగా మూడో రోజూ సమస్య..!

మరిన్ని వార్తలు