చిరుత నోట్లో కూతురి తల.. ధైర్యం చేసిన ఓ తల్లి..

18 Jul, 2021 18:24 IST|Sakshi
కూతురుతో అర్చన

ముంబై : తన ప్రాణాలకు తెగించి బిడ్డ ప్రాణాలు కాపాడిందో తల్లి. చిరుతపులితో గొడవ పడి దాని నోట్లో చిక్కుకున్న కూతురి ప్రాణాలు నిలుపుకుంది. మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. చంద్రపుర్‌ జిల్లా, జునోనా గ్రామానికి చెందిన అర్చన ఈ నెల 3న బహిర్భూమికి తన ఇంటి దగ్గర ఉన్న అడవిలోకి వెళ్లింది. అర్చనతో పాటు ఐదు సంవత్సరాల ఆమె బిడ్డ ప్రజాక్త కూడా అడవిలోకి వెళ్లింది. కొద్దిదూరం వెళ్లాక చెట్ల మధ్య అర్చన కనిపించకుండా వెళ్లిపోయింది. ప్రజాక్త తల్లి కోసం వెతకసాగింది. కొద్దిసేపటి తర్వాత చెట్ల మధ్యలోనుంచి ‘‘అమ్మా, అమ్మా’’ అన్న అరుపులు వినపడసాగాయి. దీంతో ఆమె అరుపులు వినపడ్డ చోటుకి వచ్చింది. అక్కడి దృశ్యం చూసి స్థానువై పోయింది. కూతురి తల మొత్తం ఓ చిరుత పులి నోట్లో ఉంది. అది చిన్నారిని లాక్కెళ్లటానికి ప్రయత్నిస్తోంది. వెంటనే తేరుకున్న అర్చన చిరుతపులి  వెంట పడింది. వెదురు కర్రతో దాని తోకపై కొట్టసాగింది. చిరుత... బాలిక తలను వదిలి నడుము భాగాన్ని పట్టుకుంది. అర్చన మరో దెబ్బ వేయటంతో ఈసారి ప్రజాక్తను విడిచి, ఆమెపైకి రావటానికి ప్రయత్నించింది.

ఆమె భయపడకుండా దాన్ని కొట్టడానికి ప్రయత్నించింది. చిరుత చేసేదేమీ లేక అక్కడినుంచి పరారైంది. అర్చన తీవ్ర గాయాలపాలైన కూతుర్ని ఎత్తుకుని ఇంటికి పరిగెత్తింది. భర్తకు విషయం చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లింది. చిరుతపులి దాడిలో చిన్నారి పై, కింద దవడ ఎముకలు విరిగి, పక్కకు జరిగాయి. ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మూతి భాగాన్ని సరిచేయటానికి సోమవారం పూర్తి స్థాయి శస్త్ర చికిత్స చేయనున్నారు. దీనిపై అర్చన మాట్లాడుతూ.. ‘‘ ఆ రోజు నుంచి ఎప్పుడు నేను కళ్లు మూసుకున్నా​.. నా పాప చిరుత నోట్లో ఉన్న దృశ్యమే కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ సంఘటన నుంచి బయటపడుతున్నాను. చిరుతను నేను వెంటాడి కొడితే అది నా మీద దాడి చేస్తుందని భయపడ్డాను. కానీ, నా బిడ్డనలా ఎలా చావనివ్వగలను’’ అని చెప్పుకొచ్చింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు