World Water Day,: ‘సాగు’ మారకుంటే∙ నదులు ఎడారే

24 Mar, 2022 06:14 IST|Sakshi

కోల్‌కతా: మన పంటల సాగు పద్ధతులు తక్షణమే మారకపోతే దేశంలోని నదులు ఈ శతాబ్దంలోనే ఎండిపోయి ఎడారిగా మారడం ఖాయమని పశ్చిమ బెంగాల్‌ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ కల్యాణ్‌ రుద్ర హెచ్చరించారు. భూగర్భ జలాలు ఎప్పటికీ అంతరించిపోవని చాలామంది భావిస్తున్నారని, అందులోని ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. భూగర్భ జలాలు పడిపోవడం అనేది నదుల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

పంటల సాగు పద్ధతులను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే గంగానదితో సహా ఇతర నదులు ఎండిపోతాయని వెల్లడించారు. తద్వారా మన నాగరికత ఉనికి సైతం ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యక్రమంలో కల్యాణ్‌ రుద్ర మాట్లాడారు. మనదేశంలో పంటల సాగు కోసం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలన్నారు. చెరువులు, కుంటలు విస్తృతంగా తవ్వుకోవాలని, వాననీటిని, ఉపరితల జలాలను సంరక్షించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడడం మానుకోవాలని చెప్పారు. డ్యామ్‌లు, కాలువల నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారమని వివరించారు.   

మరిన్ని వార్తలు