సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

22 Aug, 2020 05:59 IST|Sakshi

రాష్ట్ర బీజేపీ బహిరంగ హెచ్చరిక 

సాక్షి, అమరావతి: బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో తప్పుగా, అభ్యంతరకర రీతిలో ప్రచారం చేసే వారిపై క్రమశిక్షణ, క్రిమినల్‌ చర్యలు తప్పవని ఆ పార్టీ రాష్ట్ర శాఖ హెచ్చరించింది. తప్పుడు ప్రచారం చేసే వారిలో ఉద్యోగులుంటే.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సంస్థలతో పాటు బ్యాంకులను కోరతామని తెలిపింది. దేశం బయట ఉన్నవారు ఇటువంటి ప్రచారానికి పూనుకుంటే సంబంధిత దేశంలోని ఇండియన్‌ ఎంబసీకి సమాచారం పంపి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం శుక్రవారం బహిరంగ హెచ్చరికతో కూడిన ప్రకటన విడుదల చేసింది. సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులను గుర్తించడానికి పార్టీ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపింది. చంద్రబాబు, లోకేష్‌ తెలంగాణలో కూర్చుని.. రూ.లక్షలు ఖర్చుపెట్టి సామాజిక మాధ్యమాల ద్వారా బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి వే రొక ప్రకటనలో దుయ్యబట్టారు.  

► టీడీపీ కార్యాలయం నుంచి అనధికార వెబ్‌సైట్‌లు, సామాజిక మాధ్యమాల పేరుతో ప్రచారం ఎందుకు. ధైర్యం ఉంటే మీ అధికారిక వెబ్‌సైట్‌లో, అధికారిక మాధ్యమాల్లో ప్రచారం చేయండి. 
► చంద్రబాబు ఓ వైపు ప్రధాని మోదీని పొగుడుతూ లేఖ రాస్తారు. ఇక్కడ మాత్రం బీజేపీ నేతలను తిడుతూ ఉండమని తమ్ముళ్లకు చెబుతారు. ఇదేం రాజకీయం. 
► ‘రఘురామకృష్ణరాజూ.. మీకు వేరే వాళ్లు చాలా పనులు అప్పజెప్పారు. ఆ పనుల్లో బిజీగా ఉండండి. బీజేపీ తరఫున రాష్ట్రంలో ఏం చేయాలో మేం చూసుకుంటాం. మీరింకా బీజేపీకి సలహాలు ఇచ్చే స్థాయికి ఎదగలేదు.’   

మరిన్ని వార్తలు