డ్రగ్స్‌ దందా వెనుక కేసీఆర్‌ సన్నిహితులు: సంజయ్‌

9 Apr, 2022 03:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సాగుతున్న డ్రగ్స్‌ దందా వెనుక సీఎం కేసీఆర్‌ సన్నిహితులతోపాటు టీఆర్‌ఎస్‌ నేతల హస్తముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. 2017లోనే డ్రగ్స్‌ వ్యవహారంలో ప్రముఖుల ప్రమేయముందని బయటపడిందని, నాటి కేసు విచారణ ఏమైందో, ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఇక్కడ సంజయ్‌ మీడియాతోమాట్లాడుతూ ఈ కేసు రికార్డులు, ఆధారాలు సమర్పించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కోరినా వాటిని ఎందుకు సమర్పించడంలేదో చెప్పాలని నిలదీశారు.

ఈడీకి పూర్తి వివరాలివ్వాలని హైకోర్టు ఆదేశించినా, సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఎక్సైజ్‌ కమిషనర్లకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసినా ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలన్నారు. ఈడీకి ఆధారాలు సమర్పిస్తే తమవారి పేర్లు బయటకు వస్తాయనే సీఎం వాటిని తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. పంజాబ్‌లో ప్రభుత్వం కూలిపోవడానికి డ్రగ్స్‌ దందాయే కారణమని, టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పబోయేది కూడా డ్రగ్స్‌ వ్యవహారంలోనే అని హెచ్చరించారు. ఈ దందాలో బీజేపీసహా ఏ పార్టీ వారి ప్రమేయమున్నా అదుపులోకి తీసుకుని డ్రగ్స్‌ పరీక్షలు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్‌ నల్ల జెండాల నిరసనల్లో రైతులు ఎక్కడా పాల్గొనడం లేదని అన్నారు. 

గవర్నర్‌ ఏనాడూ రాజకీయాలు మాట్లాడలేదు
‘గవర్నర్‌ ఏనాడూ రాజకీయాలు మాట్లాడలేదు. వివాదాస్పద వ్యక్తి కాదు. క్రిమినల్‌ను ఎమ్మెల్సీ చేయాలని పంపే ఫైలు తిప్పి పంపితే గవర్నర్‌ మంచివారు కాదా? న్యాయంగా, రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా, ప్రజల కోసం ఆలోచించే గవర్నర్‌ మంచివారు కాదా... కేసీఆర్‌ లెక్క ఫాంహౌస్‌కు పరిమితమైతేనే మంచోళ్లా? గవర్నర్‌ పై, రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తి కేసీఆర్‌. అందుకే రాజ్యాంగాన్ని తిరగరాస్తానన్నారు.రేపు ప్రధాని అయితే రాష్ట్రపతి పదవి ఎందుకని, దానిని కూడా తీసేస్తారేమో’అని సంజయ్‌ వ్యాఖ్యానించారు.    

మరిన్ని వార్తలు