‘హామీలు అమలు చేస్తే చెప్పు దెబ్బకు సిద్ధం.. తల నరుక్కోవడానికి కూడా సిద్ధమే’

23 Dec, 2022 03:06 IST|Sakshi
సిరిసిల్లలో మాట్లాడుతున్న బండి సంజయ్‌   

కేటీఆర్‌కు ‘విత్‌ డ్రాయల్‌ సింప్టమ్స్‌’అని ఎద్దేవా 

రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్న 

కేసీఆర్‌ దుర్మార్గ పాలనకు తెరదించేందుకే యాత్ర చేస్తున్నట్లు వెల్లడి 

సిరిసిల్ల, వేములవాడలో పార్టీ నేతలతో సమావేశం

సిరిసిల్ల: బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌ దివాలా కంపెనీ అని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ అమలు చేస్తే ప్రజల కోసం చెప్పుతో కొట్టించుకోవడానికి, తల నరుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తాను డ్రగ్స్‌ వాడలేదని పరీక్షల్లో తేలితే చెప్పు దెబ్బలకు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాల్‌పై బండి ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడల్లో గురువారం బీజేపీ శ్రేణులతో సమావేశమై ‘సెస్‌’ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని దుయ్యబట్టారు. ‘కేసీఆర్‌ నా తలను 6 ముక్కలు చేస్తానన్నడు. కేసీఆర్‌ అవినీతిని ప్రశ్నిస్తుంటే ట్విట్టర్‌ టిల్లు (మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి) చెప్పుతో కొడతానంటూ పిచ్చిపిచ్చిగా వాగుతున్నడు.

డ్రగ్స్‌ వాడి మానేసిండు కదా..‘‘విత్‌ డ్రాయల్‌ సింప్టమ్స్‌’’తో బాధపడుతున్నాడు. కేసీఆర్‌ బిడ్డనేమో మా ఎంపీ అర్వింద్‌ను చెప్పుతో కొడతానంటోంది. కానీ మీలాగా సంస్కారహీనంగా మేం మాట్లాడలేం’అని సంజయ్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు భూకబ్జాలు, అవినీతి, అక్రమాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. \

కేంద్రాన్ని బద్నామ్‌ చేస్తున్నారు... 
తెలంగాణ లాగా దేశమంతటా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్‌ అంటున్నారని, తెలంగాణ ఏ విషయంలో అభివృద్ధి చెందిందో చెప్పాలని సంజయ్‌ ప్రశ్నించారు. ‘రైతు రుణాలు మాఫీ చేయలే. ఉద్యోగాలు భర్తీ చేయలే. నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు, దళితబంధు, రైతులకు ఉచిత యూరియా, దళితులకు 3 ఎకరాలు ఇయ్యలే. వడ్లు సరిగ్గా కొనుగోలు చేయట్లే.

కేసీఆర్‌ పాలనలో రైతు ఆత్మహత్యలు ఆగలే’అని బండి సంజయ్‌ మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తానని చెప్పిన కేసీఆర్‌... 15 గంటలే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చారని దుయ్యబట్టారు. రైతులకు సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ బద్నామ్‌ చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.

కేంద్రం ఎంత భారమైనా రైతులకు సబ్సిడీపై ఎరువులను సరఫరా చేస్తోందని చెప్పారు. రైతులకు ఫసల్‌బీమా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే కలిసే ముఖం కేసీఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు. కేంద్రానికి సహకరించకుండా రోడ్లు, రైల్వేలేన్లు సహా అన్ని విషయాల్లోనూ కేంద్రాన్ని అపఖ్యాతిపాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్‌ దుర్మార్గపు, నియంత, రాక్షస పాలన అంతం కోసం ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నానని బండి సంజయ్‌ వివరించారు. 

రోడ్డుపై ఉరికించి కొట్టాలే.. 
రాష్ట్రంలో ఓ అధికారి (హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావును ఉద్దేశించి) క్రైస్తవం వల్లే కరోనా తగ్గిందంటడు. క్రైస్తవం వల్లే భారత్‌ అభివృద్ధి చెందిందంటడు. ఆయనకు సిగ్గుండాలె. మరి ఈ దేశంలో ఎందుకున్నవ్‌? దేశం విడిచి పో. ఈ దేశంలో పుట్టి పరాయి పాట పాడతవా? ప్రభుత్వ అధికారిగా ఉంటూ మతప్రచారం చేస్తవా?’అని బండి ప్రశ్నించారు.

బరితెగించిన ఇలాంటి అధికారులను రోడ్లపై ఉరికించి కొట్టాలన్నారు. ఎమ్మెల్సీ సీటు కోసం, ఎమ్మెల్యే టికెట్‌ కోసం సీఎం కాళ్లు మొక్కే అధికారుల సంగతి చూస్తామని సంజయ్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణిరుద్రమదేవి, టి.వీరేందర్‌గౌడ్, మోహన్‌రెడ్డి, ఆవునూరి రామాకాంత్‌రావు, రెడ్డబోయిన గోపి, ఆడెపు రవీందర్‌లు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు