టార్గెట్‌ మహారాష్ట్ర : ప్లాన్‌ అమలు చేయండి

28 Jul, 2020 16:26 IST|Sakshi
ఠాక్రే-ఫడ్నవిస్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, మహారాష్ట్ర : అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో తిరిగి కాషాయ జెండా ఎగరేసేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. సీట్ల పంపకాల్లో విభేదాల కారణంగా ఎన్డీయే కూటమి నుంచి విడిపోయిన పార్టీలను తిరిగి వెనక్కి రప్పించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలో భాగం‍గానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశంలో కీలక ఆదేశాలు జారీచేశారు.  గత ఏడాది అధికారం నుంచి దూరమైన మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి రావాలని, దీని కోసం పటిష్టమైన వ్యూహాలను సిద్ధం చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ శాఖకు నడ్డా సూచనలు చేశారు. అంతేకాకుండా పూర్వ స్నేహితుడు శివసేనను సైతం ఎన్డీయేలోకి వచ్చే విధంగా మంతనాలు చేయాలని సలహాలు ఇచ్చారు. (నేనేమీ రిమోట్ కంట్రోల్‌ని కాదు: శ‌ర‌ద్ ప‌వార్)

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేనకు ఒప్పుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.అంతేకాకుండా ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను తిరిగి ఎన్డీయేలో చే​ర్చుకునేందుకు తామకు ఏమాత్రం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర  చర్చనీయాంశంగా మారాయి. కాగా మహారాష్ట్రలో పాగా వేసేందుకు గతంలోనూ బీజేపీ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ను ఎన్డీయేలో ఆహ్వానిస్తూ కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ బహిరంగ ప్రకటన చేశారు. మరోవైపు శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం బలంగా ఉందని ఆయా పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు