Karnataka Bypoll: హమ్మయ్య గెలిచాం!

3 May, 2021 08:12 IST|Sakshi

కాషాయానికి ఊరట 

సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో జరిగిన ఒక లోక్‌సభ స్థానం, రెండు అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ రెండు విజయాలతో పరువు నిలుపుకొంది. కాంగ్రెస్‌ ఒక సీటు గెలుచుకుంది. ఇటీవల ఉప ఎన్నికలు జరగ్గా ఆదివారం ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగింది.  

బెళగావిలో టెన్షన్‌.. మంగళ అంగడి గెలుపు  
బెళగావి ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. బీజేపీ అభ్యర్థి మంగళ అంగడి కాంగ్రెస్‌ అభ్యర్థి సతీష్‌ జార్కిహోళిపై 2,903 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. కేంద్ర మంత్రి సురేష్‌ అంగడి మృతితో బెళగావి లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు రావడం, ఆయన సతీమణి మంగళ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం తెలిసిందే. 35 రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్థి ముందంజలో కొనసాగగా, 36వ రౌండు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. 82వ రౌండ్‌లో మొగ్గు బీజేపీ వైపు మారింది. నువ్వా–నేనా అన్నట్లు ఇరుపక్షాలూ తలపడ్డాయి. మంగళకు 4,35,202 ఓట్లు,  సతీష్‌కు 4,32,299 ఓట్లు వచ్చాయి. బీజేపీ శ్రేణులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాయి. మంగళకు బీజేపీ హవా, సానుభూతి పవనాలు పని చేయలేదా..? అనేది చర్చనీయాంశమైంది.  

బసవకళ్యాణ, మస్కి చెరొకరికి  
బసవకళ్యాణ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి శరణు సలగర 20,449 ఓట్ల మెజారిటీతో గెలుపాందారు.  కాంగ్రెస్‌ అభ్యర్థి మాలకు 50,107 ఓట్లు రాగా, జేడీఎస్‌ అభ్యర్థికి 11,390 ఓట్లు రాగా,బీజేపీ అభ్యర్థికి 70,556 ఓట్లు వచ్చాయి.  

ఇక మస్కి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి  బసవనగౌడ తుర్విహాళ్‌ బీజేపీ అభ్యర్థి ప్రతాప్‌గౌడ పాటిల్‌పై 36,641 ఓట్లు మెజార్టీతో గెలుపాందారు. బీజేపీ అభ్యర్థి తరఫున ఇక్కడ సీఎం యడియూరప్ప, ఆయన తనయుడు విజయేంద్ర తదితరులు ప్రచారం చేయడం తెలిసిందే. కాగా ప్రభుత్వ వ్యతిరేకత, కొందరు నేతల సహాయ నిరాకరణ వల్ల తాను ఓటమి పాలయ్యానని ప్రతాప్‌గౌడ పాటిల్‌ వాపోయారు.  

మరిన్ని వార్తలు