మోదీ తొమ్మిదేళ్ల పాలనపై... కాంగ్రెస్‌ 9 ప్రశ్నలు

27 May, 2023 06:13 IST|Sakshi

తప్పుడు హామీలతో జాతిని దగా చేసిన ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌  

న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనపై కాంగ్రెస్‌ దుమ్మెత్తిపోసింది. మోదీ తొలిసారిగా ప్రధాని పదవి స్వీకరించి శుక్రవారానికి తొమ్మిదేళ్లయ్యాయి. తప్పుడు హామీలతో జాతిని దగా చేసినందుకు ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ‘నౌ సాల్, నౌ సవాల్‌ (తొమ్మిదేళ్లు, తొమ్మిది ప్రశ్నలు)’ పేరుతో మోదీకి 9 ప్రశ్నలు సంధిస్తూ బుక్‌లెట్‌ విడుదల చేశారు. కోట్లాది మంది నిరుద్యోగ యువత నుంచి తొమ్మిదేళ్లుగా  మోదీ పారిపోతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, విద్వేషం, నిరుద్యోగానికి మోదీయే బాధ్యత వహించాలని రాహుల్‌ అన్నారు. మోదీకి కాంగ్రెస్‌ సంధించిన 9 ప్రశ్నలు...

1. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎందుకు పెరుగుతున్నాయి? ప్రజా ఆస్తుల్ని మోదీ స్నేహితులకి ఎందుకు విక్రయిస్తున్నారు?
2. సాగు చట్టాల రద్దు ఒప్పందాలను ఎందుకు గౌరవించడం లేదు? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లేదేం?
3. మీ స్నేహితుడు అదానీ లబ్ధి కోసం ఎల్‌ఐసీ, ఎస్‌బీఐలలో ప్రజలు కష్టించి దాచి పెట్టుకున్న డబ్బుని ఎందుకు ప్రమాదంలో పడేశారు?
4. మీరు క్లీన్‌చిట్‌ ఇచ్చిన చైనా భారత భూభాగాలను ఆక్రమించుకుంటోందేం?
5. ఎన్నికల ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలతో సమాజంలో భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు ?
6. సామాజిక న్యాయ పునాదుల్ని ధ్వంసం చేస్తున్నారెందుకు? అణగారిన వర్గాలపై అరాచకాలపై మౌనమెందుకు?
7. ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామ్య సంస్థల్ని ఎందుకు బలహీనపరుస్తున్నారు? విపక్ష నేతలపై కక్ష సాధింపు రాజకీయాలెందుకు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని ధనబలంతో ఎందుకు కూలదోస్తున్నారు?
8. పేదల సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ను తగ్గించి ఎందుకు బలహీనపరుస్తున్నారు?  
9. కోవిడ్‌తో 40 లక్షల మంది పై చిలుకు మరణించినా వారి కుటుంబసభ్యులకు ఇప్పటికీ నష్టపరిహారం ఎందుకు చెల్లించడం లేదు?

 

మరిన్ని వార్తలు