బుల్లెట్‌ అర ఇంచే ఉంటుంది.. గుండెల్లో దిగితే తెలుస్తుంది: కేసీఆర్‌కు ఈటల చురకలు

11 Jul, 2022 15:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలకు పట్టిన శని కేసీఆర్‌ అంటూ ధ్వజమెత్తారు. ఈమేరకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. 2008లో కూడా కేసీఆర్‌ మతిభ్రమించి ప్రెస్‌మీట్‌లు పెట్టేవాడని గుర్తు చేశారు. హుజురాబాద్‌ ఫలితాల తర్వాత కూడా కేసీఆర్‌ వరుసగా రెండు ప్రెస్‌మీట్‌లు పెట్టారని ప్రస్తావించారు. కేసీఆర్‌ను మొన్న గెలిపించిన గజ్వేలు ప్రజలు. వచ్చే ఎన్నికల్లో ఓడించేది కూడా గజ్వేల్‌ ప్రజలేనని వ్యంగ్యస్త్రాలు సంధించారు.

కేసీఆర్‌ సవాల్‌ చేయడం కాదని, ముందు అసెంబ్లీ రద్దు చేయాయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. ‘మాట్లాడితే మోకాళ్ల హైట్‌ ఉన్నాడని అంటున్నాడు, నేను ఎంత ఎత్తు ఉన్నానో పక్కన పెడితే బుల్లెట్‌ కూడా అర ఇంచే ఉంటుంది.. కానీ అది గుండెల్లో దిగితే తెలుస్తుంది ఎలా ఉంటుందో. కేసీఆర్‌లా నేను కుసంస్కారిలా మాట్లాడను. మా అమ్మ, హుజూరాబాద్ ప్రజలు నేర్పిన సంస్కృతి, సభ్యతను మర్చిపోయి మాట్లాడను. నన్ను వ్యక్తిగతంగా దూషిస్తే. తెలంగాణ ప్రజలే నీకు బుద్ధి చెప్తారు.
చదవండి: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ సవాల్‌... సై! అన్న బండి, ఉత్తమ్‌

కేసీఆర్‌ను ఓడిస్తేనే తెలంగాణకు పట్టిన పీడ విరగడ అవుతుంది. నేను నా సవాల్‌కు కట్టుబడి ఉన్నా.. కేసీఆర్‌పై తప్పకుండా గజ్వేల్‌లో పోటీ చేస్తా. గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను బొంద పెట్టేందుకు కసితో సిద్దంగా ఉన్నారు. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నా హుజూరాబాద్ ప్రజలే. హుజూరాబాద్‌లో విజయం నాది కాదు. నా ప్రజలదే. కేసీఆర్‌ దమ్ముంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలి. ఎన్నికలకు మేము సిద్దంగా ఉన్నాం. ఇప్పటికే అమిత్ షా కూడా కేసీఆర్‌  అసెంబ్లీ ని రద్దు చేస్తే... సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.’ అని ఈటెల రాజేందర్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు