వైఎస్సార్‌సీపీలో చేరిన గుంటూరు మాజీ ఎమ్మెల్యే

20 Jul, 2021 16:56 IST|Sakshi
జియాఉద్దీన్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, తాడేపల్లి: గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జియాఉద్దీన్ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. జియా ఉద్దీన్‌ గుంటూరు-1 మాజీ ఎమ్మెల్యే. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా జియాఉద్దీన్ బాధ్యతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు.

ఇక పార్టీలో చేరిన అనంతరం జియాఉద్దీన్ మాట్లాడుతూ.. మైనారిటీలకు నిజమైన న్యాయం చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు జగన్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాడని చెప్పారు. వారి అభీష్టం మేరకే తాను వైఎస్సార్‌సీపీలో చేరినట్లు పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలో పని చేయడమే తనకు దక్కే హోదా అని వెల్లడించారు. 

టీడీపీ హయాంలో మైనారిటీ మంత్రిని కూడా పెట్టని ఘనత చంద్రబాబుది అని విమర్శించారు. తన కుటుంబానికి తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. తన సోదరుడు మరణించాక పదవులు ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఓ ఏడాది ఉందనగా మైనారిటీ కార్పొరేషన్ ఇచ్చాడని గుర్తుచేశారు. మైనారిటీలకు నిరంతరం న్యాయం జరగాలంటే వైఎస్ జగన్ చిరకాలం సీఎంగా ఉండాలని జియాఉద్దీన్‌ తెలిపారు. తాను ఎటువంటి పదవులు ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు