కరీంనగర్‌ పేరు చెబితే.. ప్రతిపక్షాల గుండెఝల్లు 

22 Jun, 2023 04:17 IST|Sakshi
విద్యుత్, బాణసంచా వెలుగుల్లో కరీంనగర్‌ కేబుల్‌ బ్రిడ్జి. బహిరంగ సభలో మాట్లాడుతున్న కేటీఆర్‌

రూ. 220 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జి, రూ. 410 కోట్లతో ఎంఆర్‌ఎఫ్‌

త్వరలో మానేరు పొడవునా సుజల దృశ్యం 

ఆగస్టు నాటికి మానేరు రివర్‌ఫ్రంట్‌ సిద్ధం 

తీగలవంతెన ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ 

అభివృద్ధిని ప్రోత్సహించాలని ప్రజలకు వినతి 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉద్యమకాలం నుంచి ‘కరీంనగర్‌ పేరు చెబితే ఝల్లు మనాలే’ అని పాటలు పాడుకున్నామని, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు గుండెఝల్లు మంటోందని మున్సిపల్‌ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కరీంనగర్‌లోని మానేరు నదిపై నిర్మించిన తీగల వంతెనను మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌లతో కలిసి బుధవారం ప్రారంభించారు.

అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరీంనగర్‌లో రూ.220 కోట్లతో తీగల వంతెన, రూ.410 కోట్లతో మానేరు రివర్‌ఫ్రంట్‌ వంటి ప్రాజెక్టులతో నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. మానేరు నది మొత్తం 180 కి.మీల పొడవునా సుజల దృశ్యంగా మార్చాలన్న పట్టుదలతో పనిచేస్తున్నామన్నారు.

ఉద్యమకాలంలో జలదృశ్యంలో మొదలై.. రాబోయే దసరా నాటికి మానేరు సుజల దృశ్యంగా ఆవిష్కారం కాబోతుందని ప్రకటించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కాళోజీ అన్నట్లుగా.. ‘నా తెలంగాణ కోటి మాగాణం’గా చేస్తున్నామన్నారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలతో గోదావరి–కృష్ణా నీటిని ఒడిసి తెలంగాణ బీడుభూములను సస్యశ్యామలం చేశామన్నారు. 

పనిచేసే వారికి పట్టం కట్టండి.. 
కరీంనగర్‌ అభివృద్ధిలో మంత్రి గంగుల కమలాకర్‌ సంకల్పాన్ని కేటీఆర్‌ ప్రశంసించారు. సీఎం ముద్దుగా ‘కరీంనగర్‌ భీముడు’ అని పిలుచుకునే గంగుల కమలాకర్‌ చొరవతోనే అందమైన జంక్షన్లు, రోడ్లతో నగరం సర్వాంగ సుందరంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను వెన్నుదట్టి మరోసారి ప్రోత్సహించాలని ప్రజలను కోరారు.

అదే సమయంలో ప్రణాళికా సంఘం బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ను ఎంపీగా కోల్పోయామని వాపోయారు. ఇపుడున్న ఎంపీ ఏం మాట్లాడుతడో ఆయనకే తెలియదని విమర్శించారు. నగరంలో పదెకరాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో గుడి కట్టిన నాయకుడు ఉన్నాడా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పల్లెప్రగతి నుంచి పట్టణప్రగతి వరకు దేశంలో మనమే నెంబర్‌ వన్‌గా ఉన్నామన్నారు.

వ్యవసాయ, పారిశ్రామిక, సంక్షేమ రంగాల్లో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ దూసుకుపోతోందని, అందులో కరీంనగర్‌ తెలంగాణలోనే అగ్రభాగంలోనే ఉందని తెలిపారు. అందుకే, పనిచేసేవారిని ప్రోత్సహించాలని కోరారు. పనిచేయని వారిన చెత్తబుట్టలో వేయాల్సిన బాధ్యత మీదేనని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లని.. అభివృద్ధే తమ కులమని.. జనహితమే తమ మతం అని ముగించారు.  

ప్రాజెక్టులతో కరీంనగర్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు : గంగుల 
అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ఉద్యమకాలం నుంచి కరీంనగర్‌ అంటే సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమని గుర్తుచేశారు. కేబుల్‌ వంతెన, మానేరు రివర్‌ఫ్రంట్‌ ఆగస్టు 15 నాటికి మొదటి దశ ప్రారంభిస్తామన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాటర్‌ ఫౌంటేన్‌ ప్రారంభమవుతుందని, ఈ ప్రాజెక్టులతో నగరానికి ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇన్ని అవకాశాలు కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ గతంలో చెప్పినట్లుగా కరీంనగర్‌ను లండన్‌ తరహాలో తీర్చిదిద్దుతున్నారన్నారు. రాష్ట్రం ఇస్తే ఏం చేస్తారన్న వెక్కిరింపులను దాటి.. నదులను ఎత్తి కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చామని, నిరంతర కరెంటు ఇస్తున్నామని చెప్పారు.    

మరిన్ని వార్తలు