Lakhimpur Incident: లఖీంపూర్‌ ఘటన పూర్తి బాధ్యత యోగి సర్కారుదే : అసదుద్దీన్‌ ఒవైసీ

4 Oct, 2021 15:18 IST|Sakshi

లక్నో: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ తెచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా యూపీలోని లఖీంపూర్‌ ఖేరీలో ఆదివారం రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన విపక్షనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై పూర్తి బాధ్యత యోగి సర్కారుదే అన్నారు.

లఖీంపూర్‌ వెళ్లకుండా విపక్షాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. యూపీ పోలీసుల దర్యాప్తుతో న్యాయం జరగదని అన్నారు. దీనిపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని అసుదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. ఇదే ఘటనపై పంజాబ్‌ కాంగ్రెస్‌ కూడా ఆందోళన చేపట్టింది. చంఢీగఢ్‌లోని రాజ్‌భవన్‌ వద్ద యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. ఈ నిరసనలో  నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పాల్గోన్నారు.

దీంతో చంఢీగఢ్‌ పోలీసులు సిద్ధూను కూడా అరెస్ట్‌ చేశారు. అదే విధంగా, ఉత్తరప్రదేశ్‌ భవన్‌వద్ద యూత్‌ కాంగ్రెస్‌ ఆందోళన చేపట్టింది. ఈ ఘటనను నిరసిస్తూ.. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం యూపీ భవన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లఖీంపూర్‌ఖేరీ పరిధిలో రాజకీయ నేతల ప్రవేశంపై నిషేదాజ్ఞలు విధించారు.

ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతిచెందిన రైతుల సంఖ్య 9 కి చేరింది.  ప్రస్తుతం యూపీలో పోలీసులు 144 సెక్షన్‌ విధించి, ప్రత్యేకంగా బారికెడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆందోళన చేపట్టిన విపక్షనేతలు ప్రియాంకగాంధీ, అఖిలేష్‌ యాదవ్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

చదవండి: Lakhimpur Incident: ‘మృతుల కుటుంబాలకు రూ.45లక్షల పరిహారం

మరిన్ని వార్తలు