Charanjit Singh Channi: ఉచితంగా నీరు.. విద్యుత్‌ చార్జీలు తగ్గింపు

21 Sep, 2021 11:19 IST|Sakshi

చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రకటన 

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం

చండీగఢ్‌: పంజాబ్‌లో పేద కుటుంబాలకు ఉచితంగా నీరు సరఫరా చేస్తామని, విద్యుత్‌ బిల్లుల భారం తగ్గిస్తామని నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రకటించారు. పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. తనను తాను ఆమ్‌ ఆద్మీ(సామాన్యుడు)గా అభివర్ణించుకున్నారు. తాను గతంలో రిక్షా లాగానని, తన తండ్రి టెంట్‌ హౌస్‌ నడిపించారని గుర్తుచేశారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

చన్నీ సోమవారం పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భన్వరీలాల్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డుకెక్కారు. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా, ఓ.పి.సోని ప్రమాణ స్వీకారం చేశారు. వారిద్దరినీ ఉప ముఖ్యమంత్రులుగా నియమించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మీడియాతో మాట్లాడారు. 200 లోపు చదరపు గజాల్లోపు ఉన్న ఇళ్ల నుంచి నీటి చార్జీలు వసూలు చేయబోమని అన్నారు. విద్యుత్‌ టారిఫ్‌ సైతం తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా సీఎంగా అమరీందర్‌ చక్కగా పనిచేశారని చన్నీ కితాబిచ్చారు. పంజాబ్‌ ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం చన్నీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని మోదీ ట్వీట్‌ చేశారు. 

చన్నీ, సిద్ధూ సారథ్యంలో ఎన్నికల్లో పోటీ
సిద్ధూ ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ  పంజాబ్‌ పార్టీ ఇన్‌చార్జి హరీష్‌ రావత్‌ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ఓట్ల కోసమే దళితుడైన చన్నీని సీఎం చేశారని విమర్శలొచ్చాయి. దీంతో పంజాబ్‌లో రాబోయే ఎన్నికల్లో  చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూల సారథ్యంలో తమ పార్టీ పోటీకి దిగుతుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా తాజా ప్రకటన చేశారు.

చదవండి: తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు