ప్రభుత్వాన్ని నడుపుతున్నదెవరు..?

2 Nov, 2020 10:57 IST|Sakshi

గవర్నర్‌ తీరుపై శివసైనికుల ఆగ్రహం

పవర్‌ ‘పవార్‌’ చేతిలోనే : బీజేపీ

సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వాన్ని విచ్ఛినం చేసేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యూహాలు రచిస్తోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజ్‌భవన్‌ను వేదికగా చేసుకుని రాజకీయాల చేస్తోందని మండిపడుతున్నారు. విద్యుత్‌ బిల్లుల వివాదం నేపథ్యంలో నవనిర్మాణ సేనపార్టీ (ఎమ్‌ఎన్‌ఎస్పీ) చీఫ్‌ రాజ్‌ రాక్రేను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు బదులుగా ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ను కలవమని సలహా ఇవ్వడంపై శివసేన నేతలు భగ్గుమంటున్నారు. గవర్నర్‌ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ మధ్య విబేధాలు సృష్టించేందుకే గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. 

పవర్‌ ఎవరి చేతిలో..
ఈ క్రమంలోనే విద్యుత్‌ బిల్లుల విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో కాకుండా శరద్‌ పవార్‌తో మాట్లాడమని గవర్నర్‌ కోశ్యారీ రాజ్‌ ఠాక్రేకి చెప్పడంతోనే రాష్ట్రంలో పవర్‌ ఎవరి చేతిలో ఉందో అర్థం అవుతోందని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ ఎద్దేవా చేశారు. శరద్‌ పవార్‌ రాష్ట్రాన్ని నడుపుతున్నారని, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను కలవడం వల్ల ఉపయోగం లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నాయకులు సైతం స్వరం అందుకున్నారు. ముఖ్యమంత్రి ఠాక్రే అయినప్పటికీ అధికారమంతా పవార్‌ చేతిలోనే ఉందంటున్నారు. (ఊర్మిళ ఆశలు అడియాశలేనా..?)

బీజేపీ నేతల విమర్శలపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ గట్టిగా స్పందించారు. ఆఘాడీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరో నెలరోజుల గడిస్తే తమ ప్రభుత్వం ఏర్పడి తొలి  ఏడాది పూర్తి అవుతుందని, ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో 15 రోజుల్లోనే కుప్పకూలుతుందని బెట్టింగులు వేశారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు ఇప్పటికే అదే పనిలో ఉన్నారని మండిపడ్డారు. రాజ్‌ ఠాక్రేను ముఖ్యమంత్రికి బదులుగా శరద్‌ పవార్‌ని కలవాలని గవర్నర్‌ సూచించి సీఎంను అవమానపరిచారని రౌత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌సీపీ ప్రభుత్వం భాగం మాత్రమేనని, సీఎం మాత్రం ఠాక్రేనే అని స్పష్టం చేశారు.

బాల్‌ఠాక్రే నమ్మకాన్ని బేఖాతరు చేశారు 
దివంగత బాల్‌ ఠాక్రే నమ్మకం, సిద్ధాంతాలను బేఖాతరు చేసిన పార్టీ తమకు పాఠాలు నేర్పక్కర్లేదని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌) పార్టీ సీనియర్‌ నేత సందీప్‌ దేశ్‌పాండే శివసేనకు చురకలంటించారు. కరోనా కాలంలో పెరిగిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని కోరుతూ ఇటీవల గవర్నర్‌భగత్‌సింగ్‌ కొశ్యారీతో ఎమ్మెన్నెస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సరైందని కాదని, ప్రజాప్రతినిధులు, సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి ఉండగా నేరుగా గవర్నర్‌తో భేటీ కావడమంటే రాష్ట్రాన్ని అవమానపర్చినట్లేనని శనివారం శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్‌ రావుత్‌ రాజ్‌ ఠాక్రేను విమర్శించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలకు ఎమ్మెన్నెస్‌ సమాధానమిచ్చింది. పరువు, ప్రతిష్ట, అవమానం అంటే ఏంటో రౌత్‌ నుంచి నేర్చుకోవల్సిన అవసరం తమకు లేదని దేశ్‌పాండే స్పష్టం చేశారు. ఒకప్పుడు ఉత్తర భారతీయులంటే గిట్టని శివసేన ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల దినోత్సవం నిర్వహించింది. వారికిష్టమైన నానబెట్టిన శెనిగెల కార్యక్రమం నిర్వహించారు.

‘‘కొద్దిరోజుల కిందట రావుత్‌ కొశ్యారీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రౌత్‌ కొశ్యారీకి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న ఫోటోను చూపించారు. మరి మీరెందుకు భేటీ అయినట్లు, నృత్యం చేయడానికా...?’’ అని దేశ్‌పాండే ఎద్దేవా చేశారు. ముందు ఈ ఫోటో గురించి మాట్లాడాలని, ఆ తరువాత ఇతరుల గురించి వ్యాఖ్యలు చేయాలని విమర్శించారు. శివసేన నాయకులు తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారు. రాజ్‌ ఠాక్రేను పీడిం చారు. అప్పట్లో ఎమ్మెన్నెస్‌కు చెందిన ఆరుగురు కార్పొరేటర్లను ప్రలోభపెట్టి శివసేనలోకిలాక్కున్న సంఘటనలను ఎలా మర్చిపోతామని ఈ సందర్భంగా దేశ్‌పాండే గుర్తుచేశారు.  

>
మరిన్ని వార్తలు