Bhanwar Lal Sharma Death: కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం దిగ్భ్రాంతి

9 Oct, 2022 10:24 IST|Sakshi

జైపూర్‌: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ ఎమ్మెల్యే భన్వర్ లాల్‌ శర్మ(77) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

భన్వర్ లాల్ భౌతికకాయాన్ని హనుమాన్‌ నగర్‌లోకి ఆయన నివాసానికి తరలించారు. అంత్యక్రియలను సోమవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

1945 ఏప్రిల్ 17న జన్మించారు భన్వర్‌ లాల్‌ శర్మ. 17 ఏళ్లకే రాజకీయ రంగ ప్రవేశం చేసి 1962లో సర్పంచ్‌గా గెలుపొందారు. 1982 వరకు ఆయనే ఆ పదవిలో ఉన్నారు. 1985 తొలిసారి లోక్‌దళ్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జనతాదళ్‌లో చేరారు. 1990లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

సర్దార్‌షహర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భన్వర్‌ లాల్‌.. కాంగ్రెస్ పార్టీ నుంచి 1998, 2003, 2013, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు.

సీఎం విచారం..
భన్వర్‌ లాల్ మృతిపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు.  శనివారం సాయంత్రం ఆయనను పరామర్శించేందుకు ఎస్ఎంఎస్ ఆస్పత్రికి కూడా వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చదవండి: షిండే, ఠాక్రే వర్గాలకు ఈసీ షాక్‌!

మరిన్ని వార్తలు