బీజేపీ వదిలిన బాణాలకు భయపడం 

2 Dec, 2022 01:02 IST|Sakshi

తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీ లేదు: మంత్రి హరీశ్‌రావు  

జగిత్యాల: బీజేపీ వదిలిన బాణాలకు భయపడబోమని, ఉత్తరప్రదేశ్, బిహార్‌లో బాణాలు, పార్టీలు, కుట్రలు ఎన్ని నడిచాయో ఏమోగానీ తెలంగాణలో నడవవని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జూటా మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. జగిత్యాలలో గురువారం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ..జీఎస్టీ కింద తెలంగాణకు ఎనిమిదిన్నర వేల కోట్లు ఇచ్చామని కిషన్‌రెడ్డి తెలిసీతెలియని మాటలు మాట్లాడుతున్నారని, అసలు జీఎస్టీ కింద తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీ లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వమే జీఎస్టీ సెస్‌ కింద కేంద్రానికి రూ.30 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రం తెలంగాణకు ఇచ్చింది 29.6% మాత్రమేనని, 42% ఇస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. మోడల్‌స్కూల్స్, బీఆర్‌జీఎఫ్‌ వంటి పథకాలనూ రద్దు చేశారన్నారు. దీని వల్ల తెలంగాణకు వేల కోట్లు నష్టం జరిగిందన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ లాంటివాటిని ఎత్తివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 157 వైద్య కళాశాలలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు.కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్, జెడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్సీలు రమణ, కౌశిక్‌రెడ్డి, భానుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు