ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాలి

12 Oct, 2021 02:05 IST|Sakshi
మౌనదీక్షలో పాల్గొన్న రేవంత్‌. చిత్రంలో షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ, భట్టి, మహేశ్వర్‌ రెడ్డి, పొన్నాల, సునీతారావ్‌ తదితరులు

సాక్షి, కవాడిగూడ (హైదరాబాద్‌): ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశానికి అన్నంపెట్టే రైతన్నలకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చిందని, తక్షణమే ఆ చట్టాలను ఉపసంహరించుకొని దేశ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు తన కాన్వాయ్‌తో రైతులను ఢీకొట్టి నలుగురి మృతికి కారణమైన ఘటనకు నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మౌనదీక్ష చేపట్టారు.

దీక్ష అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ 11 నెలలుగా రైతులు న్యాయం కోసం ఢిల్లీలో పోరాటం చేస్తుంటే సమస్య పరిష్కరించకుండా వారిపై దౌర్జన్యాలు, దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుతామని చెప్పిన మోదీ, దాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగిస్తున్నారని విమర్శిం చారు. సీఎం కేసీఆర్, మొదట్లో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి, ఢిల్లీ వెళ్లివచ్చిన తరువాత కేంద్రానికి అనుకూలంగా మారారని విమర్శించారు.  ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో.. న్యాయం అడిగితే ప్రజలను చంపుతున్నారని ఆరోపించారు.

యూపీ రైతుల హత్యలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించి, 30 రోజుల్లో తేల్చాలని డిమాండ్‌ చేశారు.   వ్యవసాయాధారిత దేశంలో రైతులకు మేలు చేస్తా నని హామీ ఇచ్చిన మోదీ ఆచరణలో అమలు చేయటంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. యూపీలో రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సమస్యను పరిష్కరించకుండా హత్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.    

మరిన్ని వార్తలు