తెలంగాణలో బొగ్గు కొరత లేదు

12 Oct, 2021 02:03 IST|Sakshi

విద్యుదుత్పత్తికి అంతరాయం రాదు... ఒప్పందమున్న అన్ని రాష్ట్రాలకు బొగ్గు 

సమీక్షలో సింగరేణి సంస్థ డైరెక్టర్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో కనీసం 5 రోజుల కు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం లేదని సింగరేణి బొగ్గు గనుల సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్, ఎన్‌.బలరామ్‌ స్పష్టంచేశారు. సింగరేణితో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల అవసరాల మేరకు బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం ఇక్కడి సింగరేణి భవన్‌లో అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు.

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన చర్యలు, వర్షాలు తగ్గుముఖం పట్టినందున నిర్దేశిత లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించే విషయంలో దిశానిర్దేశం చేశారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచడంలో ఏరియాలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై డెరైక్టర్లు అన్ని ఏరియాల జీఎంలకు మార్గనిర్దేశం చేశారు.  

ఒప్పందం ఉన్న ప్లాంట్లకు సరఫరా.. 
సింగరేణితో ఒప్పందం చేసుకున్న తెలంగాణ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లతో పాటు ముద్దనూరు(ఏపీ జెన్‌కో), పర్లీ(మహారాష్ట్ర జెన్‌కో) రాయచూర్‌ కేపీసీఎల్‌ (కర్ణాటక), మెట్టూర్‌ టాన్‌ జెడ్కో (తమిళనాడు), రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి రోజూ ఉత్పత్తి చేసే బొగ్గు లో 1.5 లక్షల టన్నులను (86 శాతం) థర్మల్‌ కేంద్రాలకే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు