నీతి, నిజాయితీకి పట్టం: కిషన్‌రెడ్డి

3 Nov, 2021 03:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్‌ ప్రజలు నీతి, నిజాయితీకి పట్టం కట్టారని, నోట్ల కట్టల కంటే నైతిక విలువలు ముఖ్యమని నిరూపించారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కితాబు ఇచ్చారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో హుజూరాబాద్‌ ఎన్నికలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. హుజూరాబాద్‌ ఫలితాల అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. అభ్యర్థి మీద ప్రజ లకు విశ్వాసం ఉంటే, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పనిచేయదని రుజువైం దన్నారు.

40 ఏళ్ల రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు చూడలేదని, ఈ విజ యం హుజూరాబాద్‌ ప్రజల విజయమని ఆయన తెలిపారు. ఈ ఎన్నికను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎన్ని రకాల పథకాలతో మభ్య పెట్టాలని చూసినా, ప్రజలు ధర్మానికి కట్టుబడి ఉన్నారని కిషన్‌రెడ్డి అన్నారు. 

అమిత్‌ షాతో కిషన్‌రెడ్డి భేటీ: హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలిచిన తర్వాత ఫలితాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. మంగళవారం సాయంత్రం జి.కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితాలు, తదనంతర పరిణామాలపై చర్చించినట్టు సమాచారం.  

మరిన్ని వార్తలు