కేసీఆర్‌ ఎన్ని ఎత్తులేసినా మునుగోడులో ఓటమి తప్పదు

21 Aug, 2022 03:08 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి.  చిత్రంలో ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డి  

కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

మునుగోడు: టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు అభద్రతాభావం పట్టుకుందని, అందులో భాగంగానే మునుగోడులో బీజేపీ సభకు ఒక రోజు ముందు ‘ప్రజా దీవెన’సభ నిర్వహించడమని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్ని సభలు పెట్టుకున్నా ఎనిమిదేళ్లుగా అబద్ధాలతో పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు పతనం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

నల్లగొండ జిల్లా మునుగోడులో శనివారం బీజేపీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు జి.వివేక్‌ వెంకటస్వామి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి తన నియోజకవర్గ ప్రజల సమక్షంలో బీజేపీలో చేరతానని జాతీయ నాయకులకు చెబితే ఆదివారం మునుగోడులో హోమంత్రి అమిత్‌షాతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

దీంతో వణుకు పుట్టిన సీఎం కేసీఆర్‌ ఎలాంటి అవసరం లేకపోయినా బీజేపీ సభ కంటే ఒక రోజు ముందే సభ ఏర్పాటు చేసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్ని ఎత్తులు, కుట్రలు పన్నినా హుజూరాబాద్, దుబ్బాక ఫలితమే మునుగోడులో కూడా పునరావృతం అవుతుందని కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఎక్కడైతే ఉప ఎన్నికలు వస్తాయో కేసీఆర్‌ అక్కడే అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. వారం రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో రోడ్లకు మరమ్మతులు, నూతన పెన్షన్లు ఇస్తున్నారని, గట్టుప్పల మండలం ఏర్పాటు చేశారని కేంద్రమంత్రి తెలిపారు.  

బీజేపీతోనే ప్రజాస్వామ్య పాలన సాధ్యం 
బీజేపీతోనే ప్రజాస్వామ్య పాలన సాధ్యమవుతుందని మును గోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అందుకే ఆ పార్టీలో చేరబోతున్నట్లు పేర్కొన్నారు. మునుగోడు అభివృద్ధికి కావాలనే నిధులు ఇవ్వకుండా అడ్డుకున్నాడని, ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే నిధులు మంజూరు చేస్తున్నందునే తాను పదవీత్యాగం చేశానని వివరించారు. 

మరిన్ని వార్తలు