దుబ్బాక ఫలితాలపై విజయశాంతి స్పందన

10 Nov, 2020 20:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అహంకారపూరిత ధోరణులకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై గూడు కట్టుకున్న వ్యతిరేకతను తమ ఓటుతో స్పష్టం చేశారని అన్నారు. దుబ్బాక ఫలితాలపై ఆమె సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.
(చదవండి : విజయం చారిత్రాత్మకం: రఘునందన్‌ )

‘ఓటమిపై సమీక్షించుకుంటామని టీఆర్‌ఎస్‌ అంటోంది. అయితే, ఈ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకుల వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలి. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని... బీజేపీ, కాంగ్రెస్‌లకు కనీసం డిపాజిట్లు వస్తాయా? అని మొదట వ్యాఖ్యానించి.... ఆ తర్వాత దుబ్బాకలో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపేనన్నారు. లక్ష మెజారిటీ ఆశించి... ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోండి. ప్రజలు మీరేం చెబితే అది నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోండి. ఏది ఏమైనా దొరాధిపత్య దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరులూదారు. చైతన్యపూరితమైన తెలంగాణ సమాజపు రానున్న రోజుల పోరాటాలలో ఈ దొర కుటుంబ పాలన ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదు’ అని విజయశాంతి అన్నారు. 
(చదవండి : దుబ్బాక ఫలితం మమ్మల్ని అప్రమత్తం చేసింది: కేటీఆర్‌)

మరిన్ని వార్తలు