హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరు?

20 Sep, 2021 04:32 IST|Sakshi

హుజూరాబాద్‌ అభ్యర్థుల మదింపు ఇంకెంతకాలమో? 

ఇప్పటికే కొలిక్కిరాని ప్రక్రియ 

అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరులో నలిగిపోతున్న పార్టీ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. కరీంనగర్‌ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్‌ నాయకుల్లో ఉన్న పోటీ, ఉత్సాహం నేడు దాదాపుగా కనుమరుగైపోయింది. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి 100 రోజులు దాటిపోయింది. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున అధికారిక అభ్యర్థిని ప్రకటించకపోయినా.. దాదాపుగా ఆయనే అభ్యర్థి అన్న విషయం తేలి పోయింది. టీఆర్‌ఎస్‌ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను బరిలో నిలుపుతున్నట్లు చాలారోజుల క్రితమే ప్రకటించేసింది. ఈ క్రమంలో మూడోపార్టీ ఇంత వరకూ వీరి మధ్యకు రాకపోవడంతో ప్రస్తుతానికి హుజూరాబాద్‌ పోరు రెండు పార్టీల మధ్య పోరుగానే మిగిలిపోయింది.

అభ్యర్థిత్వంపై దోబూచులాట
హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ఇంతవరకూ కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానం ఖాళీ అయి ఇన్ని రోజులవుతున్నా అభ్యర్థిత్వంపై అధిష్ఠానం ఇంతవరకూ నిర్ణయం తీసుకోకపోవడం కార్యకర్తలను కలవరపెడుతోంది. తొలుత జిల్లా నుంచి పత్తి కృష్ణారెడ్డి, కొండాసురేఖ పేర్లు వినిపించినా.. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఆ తరువాత ఉప ఎన్నిక కోసం దరఖాస్తులు కోరడం వారి కేడర్‌లో అయోమయాన్ని నింపింది. సెప్టెంబరు తొలివారంలో 18 మంది నేతలు హుజూరాబాద్‌లో పోటీ చేసేందుకు కరీంనగర్‌ డీసీసీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించారు. ఈ ప్రక్రియ ఇంతవరకు కొలిక్కిరాలేదు. ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాక్షాత్తూ మాజీ మంత్రి ఎమ్మెస్సార్‌ వంటి సీనియర్‌ నేతకే పోటీగా అనేకమంది రెబెల్‌ నేతలు బరిలో దిగారు. అలాంటి స్థితి నుంచి పోటీ చేసే అభ్యర్థి కోసం దరఖాస్తులు కోరాల్సిన స్థితికి వచ్చిందని దిగులు చెందుతున్నారు. 

ప్రత్యర్థుల ఎద్దేవా
టీఆర్‌ఎస్‌ సీనియర్‌నేత, మంత్రి హరీశ్‌రావు బీజేపీనే తమ ప్రత్యర్థి అని పలుమార్లు ప్రకటించారు. అసలు కాంగ్రెస్‌ ఎక్కడుందని ఎద్దేవా చేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ కూడా కేసీఆర్, హరీశ్‌రావులను టార్గెట్‌ చేసి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇరుపక్షాలు నువ్వా నేనా అన్న స్థాయిలో విమర్శలు, సవాళ్లకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తమ సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బలమైన అభ్యర్థిని బరిలోకి దించాల్సిన సమయంలో మీనమేషాలు లెక్కించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అంతర్గత కలహాలు..
జిల్లాలో కొందరు సీనియర్లు రేవంత్‌ నాయకత్వంపై ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. అయితే ఆ విషయాన్ని ఎక్కడా బయటికి కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంద్రవెల్లి, గజ్వేల్‌ సభలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి కొందరు సీనియర్‌ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను తరలించడానికి అంతగా ఆసక్తి చూపకపోవడమే ఇందుకు నిదర్శనం. అయితే, ఈ సభలకు ఆ నేతలు హాజరవడం కొసమెరుపు. మొత్తానికి పార్టీ అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరు నేరుగా బయటపడకపోయినా.. వారి చేతల్లో మాత్రం స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు