సెంచరీతో చెలరేగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌.. అయినా..!

29 Nov, 2022 12:47 IST|Sakshi

VHT 2022 Quarter Finals: విజయ్‌ హజారే ట్రోఫీ-2022లో భాగంగా పంజాబ్‌-కర్ణాటక జట్ల మధ్య నిన్న (నవంబర్‌ 28) జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్లో  కర్ణాటక జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (123 బంతుల్లో 109; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగినా, పంజాబ్‌ ఓటమి బారి నుంచి తప్పించుకోలేకపోయింది. ఫలితంగా ఆ జట్టు క్వార్టర్‌ ఫైనల్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. అభిషేక్‌ శర్మ సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ శర్మ మినహా జట్టులో మరే ఇతర ఆటగాడు కనీస పరుగులు కూడా చేయలేకపోవడంతో పంజాబ్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. కర్ణాటక బౌలర్‌ విధ్వథ్‌ కావేరప్ప 4 వికెట్లు పడగొట్టి పంజాబ్‌ పతనాన్ని శాశించాడు. 

అనంతరం 236 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 49.2 ఓవర్లలో అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను చివరి ఓవర్‌ వరకు తీసుకువచ్చారు. కర్ణాటక ఇన్నింగ్స్‌లో రవికుమార్‌ సమర్థ్‌ (71) అర్ధసెంచరీతో రాణించగా.. ఆఖర్లో మనోజ్‌ భండగే (25 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ విజయంతో కర్ణాటక సెమీస్‌కు అర్హత సాధించింది. రేపు (నవంబర్‌ 30) జరుగబోయే సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో కర్ణాటక-సౌరాష్ట్ర, మహారాష్ట్ర-అస్సాం జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు డిసెంబర్‌ 2న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి.    

మరిన్ని వార్తలు