2012 తర్వాత  చెపాక్‌లో ఆ స్టాండ్స్‌...

8 Feb, 2021 08:20 IST|Sakshi

చెన్నై: చెపాక్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు... అన్ని వైపులా చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులు ‘విజిల్‌ పొడు’ అంటూ హంగామా చేస్తుంటే... ఓ మూడు స్టాండ్స్‌ మాత్రం ఖాళీగా కనిపిస్తుంటాయి. వివిధ సమస్యల వల్ల ఏళ్ల తరబడి ఎం.ఎ. చిదంబరం మైదానంలోని ఐ, జె, కె స్టాండ్లు ప్రేక్షకులకు దూరమయ్యాయి. 2011 వన్డే ప్రపంచకప్‌ అనంతరం ఈ మూడు స్టాండ్లను సీజ్‌ చేశారు. అయితే 2012లో భారత్, పాక్‌ల మధ్య జరిగిన వన్డే కోసం ప్రత్యేక మినహాయింపుతో స్టాండ్లకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఆ స్టాండ్లలో ప్రేక్షకులు లేరు. ఇప్పుడు తమిళనాడు క్రికెట్‌ సంఘం (టీఎన్‌సీఏ) ఆ సమస్యని పరిష్కరించుకోవడంతో ఈ నెల 13 నుంచి భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో టెస్టుకు మిగతా స్టాండ్లతో పాటు ఐ, జె, కె స్టాండ్లలోనూ ప్రేక్షకులు కనిపించనున్నారు. సుమారు 12 వేల సీట్లు ఖాళీగా ఉంచడం వల్లే 2016లో టి20 ప్రపంచకప్, 2019లో ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లను చెపాక్‌లో నిర్వహించలేదు. ఇపుడు స్టేడియం అంతా కలిపి 15 వేల ప్రేక్షకుల్ని అనుమతిస్తున్నట్లు టీఎన్‌సీఏ తెలిపింది. రూ.100, రూ.150, రూ.200 ధరతో రోజువారీ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని టీఎన్‌సీఏ వెల్లడించింది.

మరిన్ని వార్తలు