విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు

16 Dec, 2021 19:28 IST|Sakshi

Amit Mishra: టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లిని తొలగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై క్రికెట్‌ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌లాగే తనకు కూడా అన్యాయం జరిగిందని అర్ధం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తున్న కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆయన ఫైరయ్యాడు. 

టీమిండియాలో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా రాణించినా.. బీసీసీఐ అకారణంగా వారిపై వేటు వేసిందని పరోక్షంగా తన గురించిన తెస్తూ బీసీసీఐపై మండిపడ్డాడు. బీసీసీఐకి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదని, గతంలో తనతో సహా చాలామంది క్రికెటర్ల విషయంలోనూ ఇలానే వ్యవహరించిదని సంచలన కామెంట్స్‌ చేశాడు. జట్టులో చోటు దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడే ప్లేయర్లకు తమను జట్టులో నుంచి ఎందుకు తొలగిస్తున్నారో తెలుసుకునే హక్కు ఉంటుందని అన్నాడు. ఆటగాళ్ల ఉద్వాసనకు గల కారణాలు తెలిస్తే.. ఆ విభాగంలో మెరుగయ్యేందుకు కృషి చేస్తారని పేర్కొన్నాడు. 

కాగా, అమిత్ మిశ్రా 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి సత్తా చాటినా అతన్ని జట్టులో నుంచి తొలగించారు. అనంతరం 2017లో తిరిగి జట్టులోకి వచ్చిన అతను.. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించినప్పటికీ.. అకారణంగా అతన్ని పక్కకు పెట్టేశారు. 39 ఏళ్ల అమిత్ మిశ్రా భారత జట్టు తరఫున 22 టెస్ట్‌ల్లో 76 వికెట్లు, 36 వన్డేల్లో 64 వికెట్లు, 8 టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. టీమిండియాలో కుంబ్లే, హర్భజన్‌, అశ్విన్‌ హవా నడుస్తుండటంతో అతను జట్టులోకి వస్తూ, పోతూ ఉండేవాడు. ఐపీఎల్‌లో మలింగ(170) తర్వాత 166 వికెట్లతో లీగ్‌లో రెండో అత్యధిక వికెట్‌ టేకర్‌గా ఉన్నప్పటికీ.. టీమిండియాలో అతనికి తగినన్ని అవకాశాలు దక్కలేదు.
చదవండి: Ashes 2nd Test: పాపం వార్నర్‌.. వందేళ్లలో ఒకే ఒక్కడు

మరిన్ని వార్తలు