'దాదా.. నువ్వు త్వరగా కోలుకోవాలి'

2 Jan, 2021 16:16 IST|Sakshi

కోల్‌కత : టీమిండియా మాజీ కెప్టెన్‌.. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ శనివారం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం తన ఇంట్లోని జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో ఆయన విలవిల్లాడిపోయారు. దీంతో సౌరవ్‌ను హుటాహుటిన ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు.  ప్రస్తుతం డాక్టర్‌ సరోజ్‌ మోండల్‌ పర్యవేక్షణలో ఆయన‌ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా సౌరవ్‌కు ప్రైమరీ యాంజియో ప్లాస్టీ పూర్తి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దాదా అనారోగ్యం పట్ల పలువురు క్రికెటర్లు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: ఆస్పత్రిలో చేరిన సౌరవ్‌ గంగూలీ)

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గంగూలీ ఆరోగ్యంపై స్పందించారు. గంగూలీ మీరు త్వరగా కోలుకోవాలని దేవుడిని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గంగూలీకి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలిస్తే బాగుంటుందని ఆయన కుటుంబసభ్యులకు సూచన చేశారు.

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పందిస్తూ.. 'దాదా మీకు ఏం కాదు.. త్వరగా కోలుకొని ఇంటికి రావాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ' ట్వీట్‌ చేశాడు. 'నా మిత్రుడు.. మా దాదా సౌరవ్‌ గంగూలీ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి రావాలని ఆ దేవుడిని కోరుతున్నా 'అంటూ మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. 'నీకు గుండెపోటు వచ్చిందన్న వార్త వినగానే నా గుండె అదిరింది. దేవుడి అండ ఉన్నంత వరకు మీకు ఏం కాదు.. గెట్‌ వెల్‌ సూన్‌ దాదా అంటూ' టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్‌ చేశాడు. పాక్‌ మాజీ క్రికెటర్‌ వకార్‌ యునీస్‌ కూడా గంగూలీ అనారోగ్యంపై స్పందించాడు. 'దాదా.. నువ్వు వ్యక్తిగతంగా చాలా ధృడంగా ఉంటావు.. మీరు త్వరగా కోలుకోవాలి 'అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. (చదవండి: వైరల్‌ : సెకన్ల వ్యవధిలో సూపర్‌ రనౌట్‌)

మరిన్ని వార్తలు