Asia Cup 2022: పాక్‌ ప్రత్యర్ధిగా వందో టీ20 ఆడేందుకు సిద్ధంగా ఉన్న కోహ్లి

9 Aug, 2022 11:29 IST|Sakshi

ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత విరామం తీసుకుంటున్న కోహ్లి, త్వరలో ప్రారంభంకానున్న ఆసియా కప్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ టోర్నీ కోసం భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన 15 మంది ఆటగాళ్ల జాబితాలో కోహ్లి చోటు దక్కించుకున్నాడు. గతకొంతకాలంగా పేలవ ఫామ్‌ కారణంగా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఈ టీమిండియా మాజీ కెప్టెన్‌.. ఆసియా కప్‌లో పాక్‌ ప్రత్యర్ధిగా తన వందో టీ20 మ్యాచ్‌ ఆడనున్నాడు.

ఆగస్ట్‌ 28న జరుగనున్న ఈ మ్యాచ్‌ జరుగనుంది. తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ మైల్‌స్టోన్‌ అయిన ఈ మ్యాచ్‌తోనైనా తిరిగి ఫామ్‌లోకి రావాలని కోహ్లితో పాటు అతని అభిమానులూ ఆశిస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్‌ పాక్‌తో మ్యాచ్‌లో మెరుపులు మెరిపించి పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు. కొందరైతే పాక్‌పై కోహ్లి చెలరేగడం ఖాయమని, మళ్లీ రన్‌మెషీన్‌ హవా కొనసాగడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్‌మీడయాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

కింగ్ కోహ్లి ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ దెబ్బ తిన్న పులిలా గర్జిస్తాడని.. దానికి తొలుత బలైపోయేది దాయాదేనని ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. కాగా, కోహ్లి గత మూడేళ్లుగా అడపాదడపా స్కోర్లు చేస్తున్నా.. మూడంకెల స్కోర్‌ మాత్రం సాధించలేకపోతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని శతక్కొట్టి 1000 రోజులు పూర్తవుతుంది. తాజాగా ఇంగ్లండ్‌తో ఆడిన సిరీస్‌లోనూ కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. ఓ టెస్ట్, రెండు టీ20లు, ఓ వన్డే ఆడి కేవలం 76 (11, 20, 1, 11, 16, 17) పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లి రీఎంట్రీ ఆసక్తికరంగా మారింది. 

ఆసియా కప్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవిబిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్.

స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌
చదవండి: Asia Cup: అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు.. నేనైతే: టీమిండియా మాజీ కెప్టెన్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు