Boxing Day Test: ఆసీస్‌ తుది జట్టు ప్రకటన; సర్ఫరాజ్‌పై వేటు వేసిన పాక్‌

25 Dec, 2023 11:19 IST|Sakshi
ఆసీస్‌ జట్టు- రిజ్వాన్‌ (PC: CA/PCB)

Aus vs Pak Boxing Day Test Squads: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విఫలమైన పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై వేటు పడింది. అతడి స్థానంలో స్టార్‌ ప్లేయర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను తుదిజట్టులోకి తీసుకుంది పాక్‌ మేనేజ్‌మెంట్‌. బాబర్‌ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత షాన్‌ మసూద్‌ పాకిస్తాన్‌ టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు.

వచ్చీరాగానే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో అతడికి కఠిన సవాలు ఎదురైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో కంగారూ జట్టు చేతిలో పాక్‌ ఘోర పరభవాన్ని చవిచూసింది. ఏకంగా 360 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

పెర్త్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ ఆటగాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్ల ధాటికి 89 పరుగులకే జట్టు ఆలౌట్‌ కావడంతో భారీ తేడాతో ఓటమి తప్పలేదు. మిగతా వాళ్లు తొలి ఇన్నింగ్స్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా సర్ఫరాజ్‌ అహ్మద్‌ మాత్రం నిరాశపరిచాడు. మొత్తంగా ఏడు (3,4) పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఈ నేపథ్యంలో ఆసీస్‌తో రెండో టెస్టుకు సర్ఫరాజ్‌ను తప్పించిన యాజమాన్యం అతడి స్థానాన్ని స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌తో భర్తీ చేసేంది. ఈ విషయం గురించి కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్‌ తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం కావాలి.

రిజ్వాన్‌ వంటి అత్యుత్తమ ఆటగాళ్లను ఒక్కోసారి పక్కనపెట్టాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అతడి అవసరం జట్టుకు ఉంది’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. నొమన్‌ అలీ, ఖుర్రం షెహజాద్‌ గాయపడటంతో జట్టుకు దూరమయ్యారు.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మాత్రం తొలి టెస్టు ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగనుంది. ఎలాంటి మార్పులు లేకుండానే మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో పాక్‌తో రెండో టెస్టు ఆడనున్నట్లు ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ ప్రకటించాడు. ఈ జట్టులో చోటు ఆశించి భంగపడిన వెటరన్‌ పేసర్‌ స్కాట్‌ బోలాండ్‌కు తగిన సమయంలో అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా కమిన్స్‌ పేర్కొన్నాడు.  

ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్:
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్‌, జోష్ హాజిల్‌వుడ్‌.

పాకిస్తాన్ జట్టు:
ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, షాహిన్ అఫ్రిది, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్, సాజిద్ ఖాన్.

చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్‌

>
మరిన్ని వార్తలు