U19 Asia Cup: 34 ఏళ్ల నిరీక్షణకు తెర.. బంగ్లాదేశ్‌ రియల్‌ హీరో అతడే!

18 Dec, 2023 12:22 IST|Sakshi

అండర్‌-19 ఆసియాకప్‌ 2023లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ ఛాంపియన్స్‌గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 160 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లా జట్టు.. తొలిసారి ఆసియాకప్‌ టైటిల్‌ను ముద్దాడింది.

సీనియర్‌ జట్టుకు కూడా సాధ్యం కానిది జూనియర్‌ బంగ్లా టైగర్స్‌ చేసి చూపించారు. దీంతో తమ 34 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. 1989 నుంచి ఆసియాకప్ టైటిల్‌ కోసం పోరాడతున్న బంగ్లా అండర్‌-19 జట్టు ఎట్టకేలకు సాధించింది. కాగా సెమీస్‌లో భారత్‌ వంటి పటిష్ట జట్టును ఓడించి మరి బంగ్లాదేశ్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

అతడే రియల్‌ హీరో..
బంగ్లాదేశ్‌ తొలిసారి అండర్‌-19 ఆసియాకప్‌ విజేతగా నిలవడంలో ఆ జట్టు హెడ్‌ కోచ్‌ స్టువర్ట్ లాది కీలక పాత్ర. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ స్టువర్ట్ లా గతేడాది జూలైలో బంగ్లా అండర్‌-19 జట్టు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లా యువ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. అతడి నేతృత్వంతో యువ క్రికెటర్లు మరింత రాటుదేలారు.

ఆసియాకప్‌ టోర్నీకి ముందు దక్షిణాఫ్రికా అండర్‌-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ బంగ్లా యువ జట్టు అదరగొట్టింది. కాగా గతంలో బంగ్లా సీనియర్‌ జట్టుకు హెడ్‌కోచ్‌గా స్టువర్ట్ లా పనిచేశారు. 2011 నుంచి 2012 వరకు ఏడాది పాటు బంగ్లా ప్రధాన కోచ్‌గా లా కొనసాగారు. అతడి పర్యవేక్షణలో తమీమ్‌ ఇక్భాల్‌, ముష్ఫికర్‌ రహీం వంటి వారు వరల్డ్‌క్లాస్‌ క్రికెటర్లగా ఎదిగారు. అదే విధంగా అతడు శ్రీలంక, వెస్టిండీస్‌ జట్ల హెడ్‌కోచ్‌గా కొనసాగారు. ఇక అతడి నేతృత్వంలోని బంగ్లా జట్టు దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్‌-19 వరల్డ్‌కప్‌లోనూ అద్భుతాలు సృష్టించే ఛాన్స్‌ ఉంది.

                          

వీరే ఫ్యూచర్‌ స్టా‍ర్స్‌..
ఈ ఆసియాకప్‌ టోర్నీతో బంగ్లా జట్టుకు  అషికర్ రెహ్మాన్ షిబ్లీ  రూపంలో  యువ సంచలనం దొరికాడు. ఈ టోర్నీ ఆసాంతం అషికర్ రెహ్మాన్ ఓపెనర్‌గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షిబ్లీ... 255 పరుగులతో టోర్నీ టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. యూఏఈతో జరిగిన ఫైనల్లో కూడా షిబ్లీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్, అరిఫుల్‌ ఇస్లాం కూడా సంచలన ప్రదర్శన కనబరిచారు. కచ్చితంగా వీరిముగ్గురూ అతి త్వరలోనే బంగ్లా జాతీయ జట్టులో కన్పించనున్నారు.
చదవండిIPL 2024: నిన్న రోహిత్‌... తాజాగా సచిన్‌ గుడ్‌బై... ముంబై ఇండియన్స్‌లో ఏమవుతోంది?

>
మరిన్ని వార్తలు