వీడ్కోలు మ్యాచ్‌పై బోర్డు ఆలోచన!

20 Aug, 2020 05:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఒక ఇన్‌స్ట పోస్ట్‌తో ఎమ్మెస్‌ ధోని తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించినా... బీసీసీఐ మాత్రం తగిన రీతిలో అతనికి వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, బోర్డు ఉన్నతాధికారి ఒకరు ఈ విషయం పరిశీలనలో ఉందని వెల్లడించారు. భారత క్రికెట్‌కు అతను చేసిన సేవలకు గుర్తింపుగా వీడ్కోలు మ్యాచ్‌ లేదా సిరీస్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ‘ఐపీఎల్‌ ముగిశాక ధోని కోసం చేయాల్సిందంతా చేస్తాం. దేశానికి అతను ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాడు. అదే స్థాయిలో ధోనికి కూడా గౌరవం దక్కాలి. మేమెప్పుడూ ధోనికి వీడ్కోలు మ్యాచ్‌ ఉండాలనే అనుకున్నాం.

కానీ ఎవరూ ఊహించని రీతిలో అతి సాధారణంగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐపీఎల్‌ సందర్భంగా ధోనితో మాట్లాడి తనకు నచ్చినట్లు మ్యాచ్‌ లేదా సిరీస్‌ ఏర్పాటు చేస్తాం. అనంతరం అతనికి నచ్చినా నచ్చకపోయినా మేం ధోనిని సత్కరిస్తాం. ధోనికి సన్మానించడం మాకు దక్కిన గౌరవం’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత మాజీ వికెట్‌ కీపర్‌ మదన్‌ లాల్‌ కూడా ధోనికి తగిన గౌరవం దక్కాలని అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ వీడ్కోలు మ్యాచ్‌ నిర్వహిస్తే తనతో పాటు అభిమానులు చాలా సంతోషిస్తారని అన్నారు. ‘అతనో దిగ్గజం. ధోనిని ఒక్క ప్రకటనతో క్రికెట్‌ నుంచి వెళ్లనివ్వకూడదు. అభిమానులంతా అతని చివరి మ్యాచ్‌ చూడాలని కోరుకుంటున్నారు’ అని మదన్‌లాల్‌ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు