ఐపీఎల్: ఆసీస్‌ ఆటగాళ్లకు సీఏ కీలక సూచన

3 Feb, 2021 18:57 IST|Sakshi

సిడ్నీ: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లను అనుమతిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) తాత్కాలిక సీఈవో నిక్‌ హాక్లీ బుధవారం తెలిపాడు. అయితే ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనాలంటే ఎన్‌వోసీ(నిరభ్యంతర పత్రం) తప్పనిసరిగా పొందాలంటూ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ ప్రారంభ సమయానికి ఆటగాళ్లకు గాయాల సమస్యలు ఉంటే తప్ప ఎన్‌వోసీ జారీ చేయడంలో ఎటువంటి సమస్య ఉండబోదని సీఏ స్పష్టం చేసింది.

కాగా ఆసీస్‌ జట్టు దక్షిణాఫ్రికా టూర్‌ను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో కరోనా స్ట్రెయిన్‌ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా పర్యటనను నిరవదిక వాయిదా వేసుకున్నట్లు సీఏ ఇప్పటికే తెలిపింది. కాగా ఆసీస్‌ జట్టుకు న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ తర్వాత ఐపీఎల్‌ ముగిసేవరకు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. దీంతో ఆసీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చదవండి: 'నేను కావాలని చేయలేదు.. క్షమించండి'

గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌కు ఆస్ట్రేలియా నుంచి 20 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. కాగా ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఐపీఎల్‌ మినీ వేలం జరగనుంది.. ఈ వేలంలో ఆసీస్‌ ఆటగాళ్లైన స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, ఆరోన్‌ ఫించ్‌లకు మంచి ధర దక్కే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఐపీఎల్‌ ఎప్పుడు నిర్వహించాలనేదానిపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బిజీ కానుంది.ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌ మార్చి 28తో ముగియనుంది. దీంతో వారం వ్యవధిలో.. అంటే ఏప్రిల్‌ మొదటి వారంలో ఐపీఎల్‌ 2021 జరిగే అవకాశం ఉంది. కాగా ఈసారి ఐపీఎల్‌ను మాత్రం స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. మొత్తం 8 జట్టు ఉండడంతో ఇంటా బయటా నిర్వహించాల్సి రావడంతో వేదిక విషయంలో తర్జన భర్జన పడుతుంది. చదవండి: ఆ రికార్డు బంగ్లా క్రికెటర్‌కే సాధ్యమైంది

మరిన్ని వార్తలు