దీపక్‌ పూనియాకు కరోనా 

4 Sep, 2020 03:55 IST|Sakshi

మరో ఇద్దరు రెజ్లర్లకు కూడా...

న్యూఢిల్లీ: క్రికెట్, హాకీ తర్వాత ఇప్పుడు కరోనా సెగ భారత రెజ్లింగ్‌నూ తాకింది. స్టార్‌ రెజ్లర్, ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత దీపక్‌ పూనియా కోవిడ్‌–19 బారిన పడినట్లు ‘స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ‘సాయ్‌’ గురువారం ప్రకటించింది. అతడితో పాటు నవిన్‌ (65 కేజీల విభాగం), కృషన్‌ కుమార్‌ (125 కేజీల విభాగం)లకు కూడా కరోనా సోకిందని తెలిసింది. హరియాణాలోని సోనేపట్‌ వేదికగా ఈ నెలలో పురుషుల జాతీయ శిక్షణ శిబిరం మొదలవ్వాల్సి ఉండగా... దీనికి ఎంపికైన రెజ్లర్లు సెప్టెంబర్‌ 1న అక్కడి ‘సాయ్‌’ సెంటర్‌లో రిపోర్ట్‌ చేశారు.

ప్రొటోకాల్‌ ప్రకారం వారికి ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా... దీపక్, నవీన్, కృషన్‌లు కరోనా పాజిటివ్‌గా తేలారు. ‘ముగ్గురు సీనియర్‌ రెజ్లర్లకు కరోనా ఉన్నట్లు తేలింది. వెంటనే వారిని ‘సాయ్‌’ హాస్పిటల్‌లో చేర్పించాము. రెండు రోజుల తర్వాత వీరికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. నెగెటివ్‌ అని వస్తే వారిని తిరిగి క్యాంపుకు తీసుకొస్తామం’ అని భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ పేర్కొన్నారు. రెజ్లర్లకు కరోనా ఉన్నట్లు తేలినంత మాత్రాన క్యాంపు రద్దయ్యే అవకాశం లేదని అతడు స్పష్టం చేశారు. రెజ్లర్ల 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన వెంటనే శిక్షణ శిబిరం ఆరంభం అవుతుందని తోమర్‌ తెలిపారు. దీపక్‌ ఇప్పటికే 86 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌ బెర్తును సొంతం చేసుకున్నాడు.

>
మరిన్ని వార్తలు