మూడో కన్నే పొరపాటు చేస్తే ఎలా?

14 Feb, 2021 05:29 IST|Sakshi

మ్యాచ్‌ల్లో అప్పుడప్పుడూ ఫీల్డ్‌ అంపై‘రాంగ్‌’ అవుతుంది. క్రికెట్‌లో ఇది సహజం. కానీ ఈ అంపైరింగ్‌ను సరిదిద్దే మూడో కన్నే (థర్డ్‌ అంపైర్‌) పొరపాటు చేస్తే... ఇంకో కన్ను ఉండదుగా! అయితే ఈ ఫలితం అనుభవించిన జట్టుకు మాత్రం శాపంగా మారుతుంది. చెన్నై రెండో టెస్టులో జరిగింది కూడా ఇదే. అందుకేనేమో రూట్‌ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఇది గ్రహించిన రిఫరీ నిబంధనల మేరకు రివ్యూను పునరుద్ధరించారు.

వివరాల్లోకెళితే... ఇన్నింగ్స్‌ 75వ ఓవర్లో స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ డెలివరీ రహానే గ్లౌజులను తాకుతూ ఫార్వర్డ్‌ షార్ట్‌ లెగ్‌లో ఉన్న ఓలీ పోప్‌ చేతుల్లో పడింది. ఇంగ్లండ్‌ చేసిన ఈ అప్పీల్‌ను ఫీల్డ్‌ అంపైర్లు పట్టించుకోలేదు. దీంతో కెప్టెన్‌ రూట్‌ రివ్యూకు వెళ్లాడు. టీవీ రీప్లేలు చూసిన థర్డ్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరీ కూడా పొరపాటు చేశారు. ఆయన రీప్లేలన్నీ ఎల్బీడబ్ల్యూ కోసం పరిశీలించారు. కానీ క్యాచ్‌ ఔట్‌ అనే సంగతి మరిచారు. ఎల్బీ కాకపోవడంతో నాటౌట్‌ ఇచ్చారు. దీనిపై అప్పుడే రూట్‌ గ్లౌజులను తాకుతూనే వెళ్లిందిగా అన్నట్లు సంజ్ఞలు చేసి అసంతృప్తి వెళ్లగక్కాడు. మొత్తానికి రివ్యూ సఫలం కాకపోవడంతో ఒక రివ్యూను ఇంగ్లండ్‌ కోల్పోయింది. తదనంతర పరిశీలనలో కోల్పోయిన ఈ రివ్యూను పునరుద్ధరించారు.

పిచ్‌ ఎలా ఉందో మాకు తెలుసు. ఇది బాగా టర్న్‌ అవుతుందని కూడా తెలుసు. అందుకే ప్రాక్టీస్‌ సెషన్లలో దీనికి తగ్గట్లే కసరత్తు చేశాం. ముఖ్యంగా టర్నింగ్‌ అయ్యే పిచ్‌లపై బ్యాట్స్‌మెన్‌ చురుకైన ఆలోచనలతో ఆడాలి. ఇక్కడ నిష్క్రియా పరత్వం ఏ మాత్రం పనికిరాదు. మనముందు దీటైన బౌలర్‌ ఉంటే మనం తనకంటే దీటైన ఆట ఆడాలి. క్రీజులో ఉన్నప్పుడు షాట్‌ ఆడాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఆ షాట్‌నే బాదేస్తాం. అలాగే నేను స్వీప్‌ షాట్‌ ఆడదామనుకునే స్వీప్‌ చేశాను అంతే! దీనికి ఔటైనంత మాత్రాన భూతద్దంలో చూడాల్సిన పనిలేదు.
    –రోహిత్‌ శర్మ, భారత ఓపెనర్‌


ఇంగ్లండ్‌కెప్టెన్‌ జో రూట్‌

మరిన్ని వార్తలు