అప్పటివరకు దెబ్బ తగిలినట్లు యాక్టింగ్‌; గోల్‌ కొట్టగానే

3 Jul, 2021 16:36 IST|Sakshi

యూరోకప్‌ 2020 చివరి అంకానికి చేరుకుంటున్న తరుణంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఇటలీ, బెల్జియం మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇటలీ జట్టు స్ట్రైకర్‌ సిరో ఇమ్మొబైల్ చేసిన పని అభిమానులను ఆశ్చర్యం కలిగించింది. ఆట 31వ నిమిషంలో ఇమ్మొబైల్ తనకు బంతిని పాస్‌ చేయాలని మిడ్‌ ఫీల్డర్‌కు సైన్‌ ఇచ్చాడు. బంతి తన వద్దకు చేరడంతో ఇమ్మొబైల్ గోల్‌ కొట్టేందుకు యత్నించాడు.

ఈ నేపథ్యంలో బెల్జియం డిఫెండర్‌ బంతిని తన్నే ప్రయత్నంలో ఇమ్మొబైల్ కాలికి తగిలింది. దాంతో అతను కింద పడిపోయి నొప్పితో విలవిలలాడాడు. అయితే ఉద్దేశపూర్వకంగా ఇది జరగకపోవడంతో మ్యాచ్‌ రిఫరీ దీన్ని పట్టించుకోలేదు. అయితే ఆ వెంటనే ఇటలీ మిడ్‌ఫీల్డర్‌ నికోలో బారెల్లా గోల్‌తో మెరిశాడు. దీంతో హాఫ్‌టైమ్‌ ముగిసేలోపే ఇటలీ భోణీ కొట్టడంతో ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగిపోయారు. అప్పటివరకు నొప్పితో విలవిలలాడుతున్నట్లు కనిపించిన ఇమ్మొబైల్‌ పైకిలేచి చిరునవ్వుతో జట్టు దగ్గరికి చేరుకొని చీర్‌ చెప్పాడు. ఇదంతా చూసిన అభిమానులు ఇమ్మొబైల్‌ చేసిన పనికి నోరెళ్లబెట్టారు. ' ఏం యాక్టింగ్‌రా బాబు.. నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు' అని కామెంట్‌ చేశారు.

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇమ్మొబైల్‌ చర్యపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ స్పందించాడు. '' రగ్బీ గేమ్‌ ఆటగాళ్లు ఫుట్‌బాల్‌ ఆటగాళ్లకు ఇలాంటి ట్రిక్స్‌ నేర్పించి ఉంటారు. ఈ పనికి రగ్బీ వారికి ఎక్కువ మొత్తం చెల్లించాలి'' అంటూ కామెంట్‌ చేశాడు. ఇక మ్యాచ్‌లో బెల్జియంను 2-1 తేడాతో ఓడించిన ఇటలీ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. బారెల్లా, ఇన్‌సిగ్నేలు చెరో గోల్‌ సాధించారు. కాగా సెమీస్‌ పోరులో ఇటలీ స్పెయిన్‌లు వెంబ్లే స్టేడియం(లండన్‌)లో తలపడనున్నాయి.

మరిన్ని వార్తలు