Ind Vs Aus: ఇండోర్‌ పిచ్‌ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం

4 Mar, 2023 10:52 IST|Sakshi

India vs Australia, 3rd Test: ‘‘భారత పిచ్‌లపై ఇరవై వికెట్లు తీయడమంటే అంత సులువేమీ కాదు. జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ వంటి స్టార్‌ పేసర్లు లేకుండా అస్సలు సాధ్యపడదు. అనుభవం తక్కువైనప్పటికీ మహ్మద్‌ సిరాజ్‌ ప్రభావం చూపగలడు. కానీ అనుకున్న ఫలితాలు రాబట్టాలంటే ఇప్పుడున్న బౌలింగ్‌ విభాగంతో సాధ్యం కాదు.

ఈ సిరీస్‌కు సంబంధించి మన బౌలింగ్‌ విభాగం మరీ అంత పటిష్టంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే, పిచ్‌ సహకారం ఉంటే టీమిండియా 20 వికెట్లు తొందరగానే పడగొట్టగలదు. ఇలాంటి పిచ్‌లు తయారు చేయడం వెనుక అసలు కారణం ఇదేనేమో!’’ అని టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్ అన్నాడు. ఒకవేళ బుమ్రా జట్టుతో ఉంటే గనుక కాస్త మెరుగైన పిచ్‌ తయారు చేసేవాళ్లని అభిప్రాయపడ్డాడు. 

డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలంటే
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే క్రమంలో బుమ్రా వంటి స్టార్ల గైర్హాజరీలో ఇలాంటి పిచ్‌లు తయారు చేయడం కంటే టీమిండియాకు మరో అప్షన్‌ లేదని పేర్కొన్నాడు. ‘‘ఒకవేళ బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంటే.. పిచ్‌ వేరేలా ఉండేదేమో! నిజానికి సొంతగడ్డపై స్పిన్నర్లే టీమిండియాకు బలం.

అందుకే వాళ్లు ఇలా చేసి ఉంటారు. ఫ్లాట్‌ పిచ్‌లపై బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించడం ఖాయం. కానీ ఈ పిచ్‌లు బ్యాటర్ల సహనానికి పరీక్షగా నిలిచాయి’’ అని సునిల్‌ గావస్కర్‌ పేర్కొన్నాడు. ఏదేమైనా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో నాగ్‌పూర్‌, ఢిల్లీ పిచ్‌ల కంటే ఇండోర్‌ పిచ్‌ పరమచెత్తగా ఉందని గావస్కర్‌ కుండబద్దలుకొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

అత్యంత నాసికరంగా పిచ్‌
ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీమిండియా తొలి రెండు టెస్టుల్లో గెలవగా... మూడో మ్యాచ్‌లో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. ఇండోర్‌లో తొలి రోజు నుంచే బంతి స్పిన్‌కు టర్న్‌ కావడంతో బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్‌ సేనకు కష్టాలు తప్పలేదు. ఆసీస్‌ స్పిన్నర్లు విజృంభించగా.. భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ వ్యూహాలు పక్కాగా అమలు చేసి.. గెలుపునందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇండోర్‌ పిచ్‌ అత్యంత నాసికరంగా ఉందని ఐసీసీ రేటింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.  

చదవండి: పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ 
నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ ఘాటు వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు