Manika Batra: మనిక బత్రాకు క్లీన్‌చిట్‌ ఇవ్వండి

16 Nov, 2021 21:20 IST|Sakshi

టీటీఎఫ్‌ఐకి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: క్రీడా సమాఖ్యలు క్రీడాకారులను అనవసరంగా వేధించడం ఆపాలని ఢిల్లీ హైకోర్డు ఆదేశించింది. స్టార్‌ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనిక బత్రాకు క్లీన్‌చిట్‌ ఇవ్వాలని భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ)ను ఆదేశించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆడకుండా ఉద్దేశపూర్వకంగానే తనను జట్టు నుంచి తప్పించారని, కోచ్‌ సౌమ్యదీప్‌ రాయ్‌ తన శిష్యురాలికి ఒలింపిక్‌ బెర్త్‌ కోసం తనను మ్యాచ్‌లో ఓడిపోవాలని ఒత్తిడి చేశారని మనిక గత నెలలో హైకోర్టును ఆశ్రయించింది.

అప్పుడు జస్టిస్‌ రేఖ పల్లి ప్లేయర్‌ ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా క్రీడా శాఖను ఆదేశించగా... సీల్డు కవర్‌లో నివేదికను కోర్టుకు సమరి్పంచింది. ఇందులో ఆమె వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని తేలడంతో ఢిల్లీ హైకోర్టు సోమ వారం విచారణ సందర్భంగా టీటీఎఫ్‌ఐపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘సమాఖ్య తీరుపట్ల నిరాశ చెందాను. కారణం లేకుండానే ఒక క్రీడాకారిణిని వివాదాల్లోకి లాగు తున్నారు. ఇది సమంజసం కాదు. క్రీడాశాఖ నివేదిక చదివాను. ఆమెకు జారీచేసిన షోకాజ్‌ నోటీసును ఉపసంహరించుకోండి. క్లీన్‌చిట్‌ ఇచ్చి భారత జట్టుకు ఎంపిక చేయండి’ అని ఆదేశిస్తూ కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు