Ind Vs Aus- Uppal Stadium: ఉప్పల్‌లో నాడు కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌! ఈ విశేషాలు తెలుసా?

24 Sep, 2022 15:19 IST|Sakshi

India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ ఫలితాన్ని తేల్చే నిర్ణయాత్మక మ్యాచ్‌కు హైదారాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. 2005 నుంచి ఇప్పటి వరకు ఈ స్టేడియంలో మొత్తం 12 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు జరిగాయి.

ఆరు వన్డేలు, ఐదు టెస్టులు, ఒక టీ20 మ్యాచ్‌కు ఉప్పల్‌ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ వేదికపై ఆదివారం(సెప్టెంబరు 25) మరో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియానికి సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు, పిచ్‌ స్వభావం, లైవ్‌ స్ట్రీమింగ్‌ తదితర విషయాలు తెలుసుకుందాం!

మొదటి మ్యాచ్‌ ఎవరితో అంటే!
►2005లో నవంబర్‌ 16న భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ ఈ వేదికపై జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది.  
►2010 నవంబర్‌ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది.  
►2017లో ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్‌కు షెడ్యూల్‌ ఖారారైనా ఆ మ్యాచ్‌ రద్దైంది.

►ఈ క్రమంలో 2019 డిసెంబర్‌ 6న భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఏకైక టీ–20 మ్యాచ్‌ జరిగింది. 
►ఆ తర్వాత ఉప్పల్‌ స్టేడియంలో మరో అంతర్జాతీయ మ్యాచ్‌ జరగలేదు.
►ఇక ఈ స్టేడియం సీటింగ్‌ కెపాసిటీ 55 వేలు 

ఎవరిది పైచేయి..?
ఉప్పల్‌ వేదికగా జరిగిన 5 టెస్టు మ్యాచ్‌లలో టీమిండియా నాలుగింటిలో గెలిచింది. మరో మ్యాచ్‌ ‘డ్రా’ అయింది. 
అదే విధంగా.. ఆరు వన్డేల్లో భారత్‌ మూడింటిలో గెలిచి, మరో మూడింటిలో ఓడిపోయింది. 

ఏకైక టీ20లో... నాడు చెలరేగిన కోహ్లి! ఏకంగా..
వెస్టిండీస్‌తో జరిగిన  టీ–20 మ్యాచ్‌లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు సాధించింది. అనంతరం భారత్‌ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. 

ఇక కేఎల్‌ రాహుల్‌ (40 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), నాటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఉన్న విరాట్‌ కోహ్లి (50 బంతుల్లో 94 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఉప్పల్‌ స్టేడియంలో టీ20 ఫార్మాట్‌(ఇంటర్నేషనల్‌)లో నమోదైన స్కోర్లు:
►అత్యధిక స్కోరు: 209/4- భారత్‌
►అత్యల్ప స్కోరు: 207/5- వెస్టిండీస్‌
►అత్యధిక పరుగులు సాధించింది(అత్యధిక వ్యక్తిగత స్కోరు): 94- నాటౌట్‌- విరాట్‌ కోహ్లి
►అత్యధిక సిక్సర్లు: కోహ్లి- 6

►అత్యధిక వికెట్లు: యజువేంద్ర చహల్‌(భారత్‌), ఖరీ పియర్‌(వెస్టిండీస్‌)- చెరో రెండు వికెట్లు 
►బౌలింగ్‌ అత్యుత్తమ గణాంకాలు: యుజువేంద్ర చహల్‌(4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు)
►అత్యధిక భాగస్వామ్యం: కోహ్లి- కేఎల్‌ రాహుల్‌(100 పరుగులు)

పిచ్‌ స్వభావం
పాతబడే కొద్ది నెమ్మదిస్తుంది. స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. గతంలో ఇక్కడ టాస్‌ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గు చూపిన సందర్భాలు ఉన్నాయి.

మ్యాచ్‌ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌
ఆదివారం రాత్రి ఏడు గంటలకు భారత్‌- ఆసీస్‌ మ్యాచ్‌ ఆరంభం
స్టార్‌ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం.

మ్యాజిక్‌ రిపీట్‌ చేయాలి!
ఇక ఉప్పల్‌ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో విరాట్‌ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన నేపథ్యంలో మరోసారి మ్యాజిక్‌ రిపీట్‌ చేయాలని కింగ్‌ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో ఆసీస్‌ విజయం సాధించగా.. నాగ్‌పూర్‌లో రోహిత్‌ సేన గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. హైదరాబాద్‌ వేదికగా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది.

చదవండి: హైదరాబాద్‌లో భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌; స్టేడియానికి ఇలా వెళితే బెటర్‌!
Ind Vs Aus 2nd T20: పాక్‌ రికార్డును సమం చేసిన రోహిత్‌ సేన! ఇక విరాట్‌ వికెట్‌ విషయంలో..

మరిన్ని వార్తలు